Early Winter For Telangana: తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చలి పులి మెల్లగా పంజా విసురుతోంది. పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున పొగమంచు కమ్మేస్తోంది. రుతు పవనాలు తిరుగుముఖం పట్టడంతో రాష్ట్రం వైపుగా చల్లని గాలులు వీస్తున్నాయి. చాలా జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు చేరుకున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉదయాన్నే పొగమంచు కమ్మేస్తోంది.
Also Read: ఫలించిన కేసీఆర్ వ్యూహం.. రోడ్ రోలర్ సింబల్ కు చెక్.. ఎలాగో తెలుసా?
తెలంగాణ వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చలి గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. అయితే వాయుగుండం ప్రభావంతో వర్షాలకు కూడా అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. తెలంగాణపైనా ప్రభావం ఉంటుందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయంటున్నారు. అయితే వాయుగుండం తుఫాన్‌గా మారి బంగ్లాదేశ్ వైపు వెళ్లి తీరం దాటుతుందని భావిస్తున్నారు.
చల్లటి గాలుల కారణంగా రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున పొగమంచు కమ్మేస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో 17 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. సోమవారం రాజేంద్రనగర్ లో అత్యల్పంగా 15. 2 డిగ్రీల సెల్సియస్, మారేడ్ పల్లి లో 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. వికారాబాద్ జిల్లాలోని మోమిన్‌పేటలో 13 డిగ్రీల సెల్సియస్ తో రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సారి తెలంగాణను మూడు వారాల ముందే చలి చుట్టేసిందని అధికారులు తెలుపుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 20 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మెదక్, హనుమకొండ, రామగుండం, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఖమ్మం, భద్రాచలం తదితర ప్రాంతాల్లో సాధారణం కంటే కాస్త ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఖమ్మంలో 35.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది.