CM Revanth Reddy: నిజామాబాద్‌లో డీఎస్ (D Srinivas) భౌతికకాయం వద్ద ఆయన నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడుగా 2004లో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రావడానికి డీఎస్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. 2009లోనూ డీఎస్ సారధ్యంలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి డీఎస్ అని కొనియాడారు.
కొంతకాలం పార్టీకి దూరమైనా పార్లమెంట్ లో డీఎస్ ను సోనియాగాంధీ (Sonia Gandhi) ఆప్యాయంగా పలకరించేవారని చెప్పారు. పదవులపై తనకు ఎప్పుడూ ఆశ లేదని డీఎస్ అనేవారని.. చనిపోయినపుడు తనపై కాంగ్రెస్ జెండా కప్పాలని డీఎస్ కోరిక అని అన్నారు. అందుకే ముఖ్య నాయకులను పంపి వారి కోరిక తీర్చాము అని చెప్పారు. డీఎస్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని అన్నారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలబడుతుందని ధీమా ఇచ్చారు. కుటుంబ సభ్యులతో చర్చించి డీఎస్ జ్ఞాపకార్ధం ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు. డీఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని చెప్పారు.