నీటి కష్టాలు వస్తున్నాయి..!
హైదరాబాద్వాసులకు పలు ప్రాంతాల్లో నీటి కష్టాలు ఎదురుకానున్నాయి. 36 గంటల పాటు తాగునీటికి అంతరాయం కలగనుంది. జూలై 19 బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటలకు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. గోదావరి తాగునీటి సరఫరా పథకం ఒకటో దశలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఓ ప్రధాన పైపులైన్ లీకేజీ మరమ్మతు పనుల నేపథ్యంలో సరఫరా నిలిచిపోనుందని వెల్లడించారు.
నగరంలోని పలు డివిజన్లలో పూర్తిగా, మరికొన్ని డివిజన్లలో పాక్షికంగా నీటి సరఫరాకు అంతరాయం కలుగనుందని జలమండలి తెలిపింది. ఓ అండ్ ఎం డివిజన్లు అయిన కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి-అల్వాల్, ఉప్పల్, నాగారం-దమ్మాయిగూడ, కొంపల్లి ప్రాంతాల్లో నీటి సరఫరాకు పూర్తిగా అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. ఎస్ఆర్‌నగర్, శేరిలింగంపల్లి, నిజాంపేట్ డివిజన్లలో పాక్షికంగా అంతరాయం కలుగనుంది.
పాక్షికంగా అంతరాయం
ముఖ్యంగా అయితే ఎల్లమ్మబండ, షాపూర్ నగర్, చింతల్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం, సైనిక్ పురి, డిఫెన్స్‌కాలనీ, కాప్రా మున్సిపాలిటీలోని కొన్ని ప్రాంతాలు, నాగారం, దమ్మాయిగూడ, రాంపల్లి, కీసర, ఆర్జీకే ప్రాంతాలకు, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూంకుంట, జవహర్ నగర్, దేవరయాంజల్, హకీంపేట్, కంటోన్మెంట్‌లోని కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోనుంది. బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, ఎల్లారెడ్డిగూడ, యూసఫ్‌గూడ ప్రాంతాలకు, కేపీహెచ్‌బీ, మలేషియన్ టౌన్‌షిఫ్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలకు, లింగంపల్లి నుంచి కొండాపూర్, గోపాల్ నగర్ కొన్ని ప్రాంతాలకు పాక్షికంగా అంతరాయం ఏర్పడనుంది.