శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు , ప్రముఖ విట్రియోరెటినల్ సర్జన్ ఎస్‌ఎస్ బద్రీనాథ్ మంగళవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. విదేశాల్లో చదువు పూర్తి చేసిన బద్రీనాథ్ అనేక అధ్యయనాలు పరిశోధనలు చేశారు. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం ఆయనకు 1996 లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.
ఆయన 1978 లో చెన్నైలో శంకర్ నేత్రాలయను స్థాపించి విశేష సేవలందించారు. చాలా కాలం పాటు దానికి ఆయన చైర్మన్ గా ఉన్నారు. బద్రీనాథ్ 1940 లో చెన్నెలో ఫిబ్రవరి 24న జన్మించారు. చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని కోల్పోయారు. వారు చనిపోయిన తరువాత వచ్చిన బీమా నగదుతో ఆయన వైద్య శాస్త్రంలో తన చదువు పూర్తి చేశారు.
ఆ తరువాత న్యూయార్క్ లో డాక్టర్ వృత్తిని ప్రారంభించి..అనేక వైద్య కేంద్రాల్లో శిక్షణ తీసుకున్నారు. ఆ తరువాత ఆయన చెన్నైకి వచ్చి 1978 లో తన తోటి వైద్యుల సాయంతో చెన్నైలోని శంకర నేత్రాలయ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థలో పేదలకు ఉచితవైద్య చికిత్సను అందించడానికి కృషి చేశారు.
ఆయన స్థాపించిన శంకర నేత్రాలయ సంస్థ ప్రతిరోజూ వందల మంది పేదలకు ఉచిత వైద్య చికిత్స కేంద్రంగా మారింది. కాగా బద్రీనాథ్ భార్య వాసంతి పీడియాట్రిషియన్, హెమటాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. బద్రీనాథ్ మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఆయన చేసిన నిర్విరామ సేవ, సమాజానికి కొన్ని తరాల పాటు స్ఫూర్తి కలిగిస్తుందని పేర్కొన్నారు.
ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, ముఖ్యమంత్రి స్టాలిన్, ఎఐడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి బద్రీనాధ్‌కు నివాళులు అర్పించారు.
Also read: విద్యార్థులకు గుడ్ న్యూస్..సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!