Hyderabad: హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ తీరాన కోట్లాది రూపాయలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ అంబేద్కర్ విగ్రహం, అమరుల స్మృతి చిహ్నం కళ తప్పుతున్నాయి. ఈ కట్టడాలు పూర్తై రెండేళ్లు దగ్గరపడుతున్నా ప్రజా సందర్శనకు నోచుకోవట్లేదు. ఇప్పటికీ నో ఎంట్రీ బోర్డులు దర్శనమివ్వడతో ప్రపంచ నలుమూలలనుంచి అక్కడికి వచ్చిన సందర్శకులంతా నిరుత్సాహానికి గురువుతున్నారు. అంతేకాదు ఈ చారిత్రక కట్టడాలు సెల్ఫీ పాయింట్లుగానే మిగిలిపోగా.. గ్యాలరీలు దుమ్ము పట్టిపోతున్నాయి. ఈ క్రమంలోనే మేధావులు, ప్రజలనుంచి ఎంట్రీ ఎప్పుడునే ప్రశ్నలు మొదలవుతున్నాయి.
అమరులైన వారిని నిత్యం స్మరించుకునేందుకు..
ఈ మేరకు రూ.146 కోట్ల వ్యయంతో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 2023 ఏప్రిల్ 14న అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా అంబేద్కర్ ముని మనవడు ప్రకాశ్ అంబేద్కర్, ప్రజాప్రతినిధులు, 50వేలమంది ప్రజల సమక్షంలో అప్పటి ముఖ్యముంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ కోసం అమరులైన వారిని నిత్యం స్మరించుకునేందుకు వీలుగా రాష్ట్ర సచివాలయం ఎదురుగా రూ. 177.50 కోట్ల వ్యయంతో ప్రపంచంలోనే అతి పెద్ద స్టెయిన్ లెస్ స్టీల్ తెలంగాణ అమరవీరుల స్మారకం జూన్ 22న ప్రారంభించారు.
దుమ్ము పట్టిపోతున్న లైబ్రరీ, మ్యూజియం..
ఇక 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కిందభాగంలో 50 అడుగుల ఎత్తు, 172 అడుగుల వెడల్పుతో లైబ్రరీ, మ్యూజియం, జ్ఞాన మందిరం, అంబేడ్కర్ జీవిత ముఖ్య ఘట్టాల ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. కానీ వీటి నిర్వహణ లేక పీఠంలోని నిర్మాణాలు పాడైపోతున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 3.29ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.179 కోట్లతో మూడు అంతస్తులతో చేపట్టిన అమరుల స్మృతి చిహ్నం పరిస్థితి కూడా ఇలానే తయారైంది. ఈ స్మృతి చిహ్నం లోపలి భాగంలో మూడంతస్తుల్లో మ్యూజియం, కన్వెన్షన్ హాల్‌తోపాటు జ్యోతిని సందర్శించేలా ఏర్పాట్లు చేశారు. ఈ కన్వెన్షన్ హాల్ సభలు, సమావేశాల నిర్వహణకు అనువుగా ఉండడంతో పాటు ఆదాయం తెచ్చిపెడుతుంది. కానీ ప్రస్తుతం నిరుపయోగంగా మిగిలడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: AP Govt Employees: ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. 8 శాతం పెంపు!
రేవంత్ సర్కార్ సందర్శనకు అనుమతిస్తుందని భావించినా..
ఇటీవల అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ సందర్శనకు అనుమతిస్తారని అందరూ భావించారు. కానీ ఎన్నికల కోడ్ కారణం చూపిస్తూ ప్రభుత్వం అక్కడ ఎలాంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించలేదు. రేవంత్ సైతం అక్కడ నివాళి అర్పించకపోవడంపై పెద్ద ఎత్తున్న విమర్శలు వచ్చాయి. మరోవైపు ఎన్నికోడ్ కారణంగానే సీఎం అక్కడికి వెళ్లలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక మహానగరంలో పార్కులు, సందర్శన ప్రాంతాలను ఆర్ అండ్ బీ అధికారులు హెచ్‌ఎండీఏకు అప్పగించేందుకు తాత్సారం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగాన్ని కాపాడుతామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా చారిత్రక కట్టడాల నిర్వహణపై దృష్టి కేంద్రీకరించి, సందర్శనకు అనుమతించాలని ప్రజలు కోరుతున్నారు.