చైనాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. గత నాలుగు రోజులుగా రాజధాని బీజింగ్ లో కురుస్తున్న వర్షాలకు ఇప్పటి వరకు 20 మంది మరణించారు. మరో 19 మంది గల్లంతు అయ్యారు. డొక్సూరీ తుపాన నేపథ్యంలో రాజధానిలోని సుమారు 50 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉండటంతో పలు చోట్ల రహదారులను మూసి వేశారు.
తుపాన్ నేపథ్యంలో దేశంలోని పలు నదుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. దీంతో వరద నీటి కోసం మొదటి సారిగా బిజీంగ్ లోని స్టోరేజ్ రిజర్వాయర్ ను ఉపయోగిస్తున్నారు. ఈ స్టోరేజి రిజర్వాయర్ ను నిర్మించిన 25 ఏండ్ల తర్వాత మొదటి సారిగా దీన్ని ఉపయోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
వరద నేపథ్యంలో మెంటౌగ్ స్టేషన్ సమీపంలో పలువురు ప్రమాణికులు చిక్కుకు పోయారు. తుపాన్ లో చిక్కుకు పోయిన వాళ్లకు సహాయం అందించేందుకు 26 మంది సైనికులతో కూడిన బృందాన్ని ప్రభుత్వం పంపించింది. సహాయ చర్యల్లో భాగంగా వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వాళ్లకు నాలుగు హెలికాప్టర్ల ద్వారా ఆహార, ఇతర సామగ్రిని అందజేస్తున్నట్టు పేర్కొన్నారు.
బీజింగ్ లో శనివారం అర్ధరాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు సరాసరి 176.9 మిమీ వర్షపాతం కురిసినట్టు స్థానిక మీడియా తెలిపింది. మెంటోగ్ ప్రాంతంలో సుమారు 150,000 కుటుంబాలకు నీటి సరఫరా ఆగిపోయింది. దీంతో అత్యవసరంగా 45 వాటర్ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.