Medaram in Helicopter : తెలంగాణ(Telangana) లోనే అతిపెద్ద పండగ... మేడారం జాతర(Medaram Jatara) ఇవాళ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మేడారంలో భక్తులకు హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. మేడారం జాతరకు లక్షలు కాదు కోటిమంది భక్తుల వరకు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వన దేవతలను గద్దె దగ్గరకు తీసుకువచ్చి ప్రతిష్టించడం నుంచి మొదలుకుని.. మళ్లీ వన ప్రవేశం అయ్యేంత వరకు.. అన్నీ ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారమే నిర్వహిస్తారు. మేడారం జాతరకు తెలంగాణ కుంభమేళా అనే ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దేశం నలుమూలల నుంచే కాదు... ఇతర దేశాల నుంచి కూడా మేడారంకు తరలివస్తుంటారు.
ఒక్కప్పుడు ఎడ్ల బండ్ల మీద మేడారంకు పయనమయ్యేవారు భక్తులు. ఇప్పుడు ఏకంగా హెలికాప్టర్(Helicopter) లో వెళ్లే అవకాశం వచ్చింది. ఈసారి కూడా మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇవాళ్టి నుంచి 25 వరకు హెలికాప్టర్ సేవలను భక్తుల కోసం అందుబాటులో ఉంచనున్నారు. హనుమకొండ(Hanamkonda) నుంచి హెలికాప్టర్ సేవలు మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం అందుబాటులో ఉండనున్నాయి. హెలికాప్టర్ లో వెళ్లే వారికోసం ప్రత్యేక దర్శనాల కోసం స్పెషల్ ఎంట్రీ కోసం ఏర్పాట్లు చేశారు.
మొక్కులు చెల్లించుకుని తిరిగి హనుమకొండకు ప్రయాణం ఉంటుంది. మేడారంలో ప్రత్యేకంగా హెలికాప్టర్ జాయ్ రైడ్(Helicopter Joy Ride) కూడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జాతర పరిసరాలను విహంగ వీక్షణం చేయవచ్చని నిర్వహకులుచెబుతున్నారు. హనుమకొండ నుంచి మేడారం వరకు ప్రయాణికులు ఒక రౌండ్ ట్రిప్ తో సహా వీఐపీ దర్శనాన్ని కూడా పొందవచ్చు. దీనికి ఒక్కొక్కరికి రూ. 28,999 చెల్లించాల్సి ఉంటుంది. హెలికాప్టర్లో ఒకేసారి ఆరుగురు ప్రయాణించే వీలుంటుంది. కుటుంబం మొత్తం ఒకే ట్రిప్ తో మేడారం వెళ్లడానికి బుక్ చేసుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.
ఇక జాతర సాగే ప్రాంతంలో 6 నుంచి 7 నిమిషాల పాటు గాలిలో చక్కర్లు కొడుతుంది. అమ్మవారి గద్దె పక్కన నుంచి మొదలయ్యేరైడ్ జంపన్నవాగు, చిలుకలగుట్ట పక్క నుంచి చుట్టూర ఉండే జాతర పరిసరాల మీదుగా ఉంటుంది.జాయ్ రైడ్ కోసం ఒక్కొక్కరి నుంచి 4800 ఛార్జీ వసూలు చేస్తారు. మిగతా సమాచారం కోసం 74834 33752, 04003 99999 నెంబర్లలో సంప్రదించవచ్చు. లేదంటే infor@helitaxi.com ఆన్ లైన్లోనూ తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి : విరాట్ కోహ్లీని వదలని కేటుగాళ్లు.. వీడియో వైరల్