Election Commission: ఏపీలో ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఏపీలో జూన్ 4 న ఎలక్షన్ ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో ఈసీ కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారులు, సిబ్బంది, పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ఏపీలోని జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో చర్చలు జరిపారు. పోలింగ్ సమయంలో జరిగిన కొన్ని ఘటనల దృష్ట్యా స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్ ప్రక్రియ ఉండాలని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని.. ఇతరులను అనుమతించొద్దని సూచించారు.
ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. రాయలసీమ, పల్నాడు జిల్లాలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హింస చెలరేగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. జూన్ 4న త్వరగా ఫలితాలు విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు.