DMK: వివాదాస్పద వ్యాఖ్యలతో డీఎంకే నేతలు వరుసగా వార్తల్లోకెక్కుతున్నారు. గతంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి (Udayanidhi) సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యల వివాదం ఇంకా పూర్తిగా సమసిపోకముందే ఆ పార్టీ ఎంపీ ఈసారి ఏకంగా పార్లమెంటులోనే నోరుజారారు. ఓ వైపు రాజధాని చెన్నై నగరం వరదల్లో మునిగిపోతున్న సమయంలో, ఉత్తరాది రాష్ట్రాలపై డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
ఇది కూడా చదవండి: వ్యాయామం ఎప్పుడు చేస్తే మంచిదో తెలుసా
ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ (BJP) విజయంపై వ్యాఖ్యానిస్తూ "... ఈ బీజేపీ అధికారం ముఖ్యంగా హిందీ ప్రాధాన్యమున్న రాష్ట్రాల్లో గెలవడంతోనే అని దేశ ప్రజలు గుర్తించాలి. ఆ రాష్ట్రాలను మనం గోమూత్ర రాష్ట్రాలుగా పిలుస్తాం. వారు దక్షిణ భారతదేశానికి రాలేరు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫలితాలు చూస్తే ఇది అర్థమవుతుంది" అన్నారు. దానికి కొనసాగింపుగా వాటిపై అధికారం కోసం ఈ రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చినా ఆశ్చర్యం లేదని, దక్షిణాదిపై ఆధిపత్యం కోసం బీజేపీ కలలు కంటోందని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై పెద్ద వివాదమే చెలరేగింది. బీజేపీతో పాటు పలువురు విపక్ష నేతలు కూడా సెంథిల్ కుమార్ వ్యాఖ్యలను ఖండించారు.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సెంథిల్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. చెన్నై వరదల్లో మునిగిపోయినట్టే డీఎంకే అహంకారంలో మునిగిపోయిందన్నారు. డీఎంకే అహంకారం ఆ పార్టీని పతనావస్థకు తీసుకెళ్తుందని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో బీజేపీ అధికారం చేపట్టిన విషయం, పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి అధికారాన్ని విస్మరిస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి ఉన్న ప్రజాదరణను ఓర్వలేక ఇలాంటి వ్యాఖ్యలకు పాల్పడుతున్నారని ఎంపీ అన్నపూర్ణాదేవి అన్నారు.
డీఎంకేకు ఇవి కొత్త కాదు, గతంలో సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వ్యాఖ్యల వివాదం తెలిసిందే. డెంగీ వంటి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలపై భారీగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే తన వ్యాఖ్యల్ని వక్రీకరించారంటూ ఆయన వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. తాజాగా ఆ పార్టీ ఎంపీ పార్లమెంటులోనే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ఆ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.