తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపథకం అమలుపై సందిగ్ధత నెలకొంది. ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు విషయంలో ప్రభుత్వానికి ఇంకా స్పష్టత రాలేదు. ఇళ్ల నిర్మాణం విషయంలో అధికారులు పలు సందేహలు వ్యక్తం చేస్తున్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షల లోపే ఖర్చవుతుందని తెలిపారు. రూ.5లక్షలతో ఇళ్లు నిర్మించుకోవాలంటే 70 గజాల స్థలం కావాలని వారంటున్నారు. అయితే తెలంగాణలో 60 గజాల కంటే తక్కువగా సొంత జాగ ఉన్నవాళ్లే ఎక్కువగా ఉన్నారని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. విస్తీర్ణంతో సంబంధం లేకుండా అందరికీ రూ.5లక్షలు ఇస్తే అందులో ఎక్కువ మొత్తం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.ఈ సందేహల నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల పై సందిగ్ధత నెలకొంది. సందేహలు నివృత్తి అయ్యాకే ఇందిరమ్మ ఇళ్ల విషయం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సొంత స్థలం ఉన్నవారికి గృహలక్ష్మి పథకం కింద రూ.3లక్షల ఆర్థిక సాయం అందజేసింది. గత ఎన్నికల్లో అధికారంలోకి వస్తే సొంత స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే అందరికీ రూ.5లక్షలు ఇస్తే అవినీతి ఆరోపణలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లు పథకం డిజైన్లపై ఇప్పటివరకు ప్రభుత్వం వద్ద ఎలాంటి స్పష్టత లేదు. అయితే మూడు రకాలా డిజైన్లు రూపొందిస్తామని మంత్రి పొంగులేటి చెబుతున్నారు. కానీ ప్రభుత్వం రూపొందించే డిజైన్లలో అందరూ ఇళ్లు కట్టుకునే అవకాశం ఉండకపోవచ్చని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయించిన ఒకే ఆకృతిలో అన్ని స్థలాలు ఉండకపోవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.