Discount On Pending Challans : రాష్ట్రంలో వాహనదారులకు పెండింగ్ చలానాలు నుంచి విముక్తి కలిగించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన చలానాపై రాయితీ స్కీమ్ కు వాహనదారుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. మొదటి 5 రోజుల్లోనే 33.81 లక్షల చలాన్లు(Pending Challans) క్లియర్ కాగా ప్రభుత్వ ఖజానాకు రూ.29.45 కోట్లు జమయ్యాయి. మరో 11 రోజులపాటు ఈ ఆఫర్ ఉన్న నేపథ్యంలో దీనికి రెట్టింపు మొత్తంలో వసూళ్లు రావచ్చని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు హైదరాబాద్(Hyderabad) కమిషనరేట్ పరిధిలో 11.17 చలాన్లు క్లియర్ కాగా రూ.7.7కోట్ల ఆదాయం వచ్చింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3.5లక్షల చలాన్లు క్లియర్ కాగా రూ.2.86కోట్ల ఆదాయం సమకూరింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6.23 లక్షల చలాన్లు క్లియర్ కాగా రూ.6.31 కోట్లు వసూలయ్యాయి.
ALSO READ: త్వరలోనే మెగా డీఎస్సీ.. సీఎం రేవంత్ ఆదేశాలు
పోలీస్ శాఖ ప్రకటించిన డిస్కౌంట్‌ల వివరాలు :
* ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి 90 శాతం రాయితీ.
* టూ వీలర్ చలాన్లపై 80 శాతం రాయితీ.
* ఫోర్ వీలర్స్, ఆటోల చలాన్లపై 60 శాతం రాయితీ.
* లారీ, ఇతర భారీ వాహనాల చలాన్లపై 50 శాతం రాయితీ.
ALSO READ: రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
2022లో ట్రాఫిక్ చలానాలపై రాయితీ ఇలా..
2022 మార్చి 31 నాటికి తెలంగాణలో 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గత ఏడాది ప్రత్యేక రాయితీ ప్రకటించింది రాష్ట్ర సర్కార్. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈ అవకాశాన్ని 65 శాతం మంది వాహనదారులు ఉపయోగించుకున్నట్లు సమాచారం. తాజాగా గత నెలాఖరుకు చలానాల సంఖ్య మళ్లీ రెండు కోట్లకు చేరుకుందని సమాచారం. ఈ నేపథ్యంలో మరోసారి రాయితీ ప్రకటించనున్నారు.