Differences in Denduluru YCP Rebellion of Leaders against MLA Abbaya Chowdary: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీకి చిక్కులు ఎదురువుతున్నాయి. 175కి 175 సీట్లు సాధిస్తామంటోన్న నేతలకు అసమ్మతి ఎదురవుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అసమ్మతి పోరును ఎదుర్కొంటున్నారు. దీంతో వైసీపీ అధిష్టానానం తలలు పట్టుకుంటోంది. తాజాగా ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో అసమ్మతి భగ్గుమంతి. ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై సొంత పార్టీ నేతల తిరుగుబాటు ప్రకటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కొఠారు అబ్బయ్య చౌదరికి టికెట్ ఇస్తే వైసీపీ ఓటమి పాలవ్వడం ఖాయమని అంటున్నారు. రాబోయే ఎలక్షన్స్ లో వైసీపీ అభ్యర్థిని మారిస్తేనే పార్టీ విజయానికి కృషి చేస్తామని తెగేసి చెప్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో బయటపడ్డ వర్గపోరు ఇప్పుడు ఏలూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మారాల్సిందే:
దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి పై వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆలపాటి నరసింహమూర్తి నిప్పులు చెరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అబ్బయ్య చౌదరికి టికెట్ ఇవ్వొద్దంటూ అధిష్టానానికి తెలియజేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అబ్బయ్ యచౌదరి 17 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారని.. 2024 ఎన్నికల్లో 20వేల ఓట్ల తేడాతో ఓడిపోనున్నారని ఆలపాటి నరసింహమూర్తి చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని మారిస్తే తప్ప పార్టీకి పనిచేసే ప్రసక్తే లేదని నరసింహమూర్తి చెప్పుకొచ్చారు. ఉప ఎన్నికల్లో పంచాయతీ వార్డు సభ్యులనూ గెలిపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారంటూ ఆలపాటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ కోసం కష్టపడిన వాళ్లని పక్కన పెట్టారు:
పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టేసి సొంత కోటరీ ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. కోటరీతో నియోజకవర్గంలో మట్టి, ఇసుక మాఫియా దగ్గర నుంచి భూకబ్జాలు, జూదాలు, కోడిపందేలు, చేపల చెరువుల అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారంటూ ఆలపాటి సంచలన ఆరోపణలు చేశారు. పెదవేగి, దెందులూరు మండలాల్లో వైసీపీకి ఓట్లు పడే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. ఇందుకు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నియంతృత్వ పోకడలే కారణమని అన్నారు ఆలపాటి నరసింహమూర్తి. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ అంశాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విదేశాల్లో ఉంటూ అనుచరులతో పెత్తనం:
అబ్బయ్య చౌదరి విదేశాల్లో ఉంటూ ఇక్కడ తన అనుచరులతో పెత్తనం చేయిస్తున్నారని ఆలపాటి నరసింహమూర్తి ఆరోపించారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆయన కోటరీ చేస్తున్న అవినీతి, అక్రమాలతో పార్టీని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఈ విషయాలన్నింటినీ పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని నరసింహమూర్తి చెప్పుకొచ్చారు. అబ్బయ్య చౌదరిపై సీనియర్ నేతలు, కార్యకర్తలకు నమ్మకం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో అబ్బయ్య చౌదరికి టికెట్ ఇవ్వ కూడాదన్నదే తమ లక్ష్యం అన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ గెలుపుకోసం అహర్నిశలు శ్రమించిన తమను గుర్తించకపోవడంతో నియోజకవర్గంలో తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే లేళ్ల అప్పిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చారు వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆలపాటి నరసింహమూర్తి.