Minister Jayaram Verses Incharge Virupakshi: ఏపీలో లోకసభ ఎన్నికలకు మరో రెండు మూడు నెలలు మాత్రమే ఉంది. ఈ సమయంలో పార్టీ గెలుపు కోసం కలిసి పనిచేయాల్సిన సొంత పార్టీ నేతలే ఎవరికివారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఆలూరు వైసీపీ ఇంచార్జి విరుపాక్షీ, మంత్రి గుమ్మనూరు జయరాం మధ్య సఖ్యత కుదరడం లేదు. వీరిద్దరి తీరుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. మరోవైపు అధికారులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
అసలేం జరిగిందంటే?
హాళగుంద నుండి మార్లమాడి రోడ్డుకు మొదటగా భూమి పూజ చేశారు ఆలూరు వైసీపీ ఇంచార్జి విరుపాక్షీ. అయితే, ఆ తరవాత అదే రోడ్డుకు భూమి పూజ చేశారు మంత్రి గుమ్మనూరు జయరాం. ఒకే రోడ్డుకు ఇద్దరు నేతలు వేరువేరుగా పూజ చేయడంతో కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అటు అధికారులు సైతం సతమతమవుతున్నారు. ఇరువర్గల మధ్య ఏం జరుగుతుందోనని ముందస్తుగా పోలీసుల గట్టి చర్యలు చేపట్టారు.
Also Read: వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించిన మంత్రి బొత్స.. మా పార్టీ విధానం ఇదే..!
ప్రజలే బుద్ధి చెబుతారు
భూమి పూజ అనంతరం మంత్రి జయరామ్ మాట్లాడుతూ..ఆలూరు నియోజకవర్గంలో గుమ్మానురు ఛార్మిష ఎప్పుడు తగ్గదన్నారు. 2009 నుంచి రాజకీయల్లో ఉన్నానని.. అంచలంచెలుగా ఎదిగి మంత్రి అయ్యానని వ్యాఖ్యనించారు. నియోజకవర్గ ప్రజలు తనను ఒక కుటుంబ సభ్యునిగా చూసుకున్నారని తెలిపారు. రాజకీయ నేతలు ప్రజలను ప్రేమిస్తే.. నేతలను ప్రజలు ప్రేమిస్తారని కామెంట్స్ చేశారు. దూకుడుగా వెళ్లే వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు కేవలం 3 నెలలే ఉన్నాయని పరోక్షంగా నూతన ఆలూరు ఇంచార్జ్ వీరుపాక్షి పై మంత్రి జయరామ్ విమర్శలు గుప్పించారు.
టీడీపీ గెలుపుకు ఛాన్స్
అయితే, వీరిద్దరి తీరుపై వైసీపీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో కలిసికట్టుగా పనిచేయాల్సింది పోయి వేరు వేరుగా కార్యక్రమాలు చేస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు. కాగా, ఈ విభేదాలు ఇలానే కొనసాగితే మాత్రం టీడీపీ గెలుపుకు ఛాన్స్ ఇచ్చినట్లేనని పార్టీ నేతలు అంటున్నారు.