Dhoni Retairment: ఎన్నెన్నో అనుకుంటాం.. ధోనీ కోరిక తీరలేదు..అభిమానుల ఆశలు చావలేదు.. చెన్నైలో చివరి మ్యాచ్ ఆడాలనేది ధోనీ కోరిక. అయితే, ఆర్సీబీ పై ఓడిపోవడంతో చెన్నై కి మరో మ్యాచ్ ఆడే ఛాన్స్ లేదు. ఇప్పుడు ధోనీ ఏం చేస్తాడు అనేది పెద్ద ప్రశ్న. మరో పక్క అభిమానులు మాత్రం ధోనీ రిటైర్ అవ్వకూడదనీ.. వచ్చే ఐపీఎల్ లో చెన్నైలోనే వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నారు By KVD Varma 19 May 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Dhoni Retairment: ఎంఎస్ ధోనీ.. ఇప్పటి క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. భారత క్రికెట్ జట్టుకు ఒక జోష్ తీసుకువచ్చిన స్టార్ క్రికెటర్. ధోనీ ముందు.. ధోనీ తరువాత అని ఇప్పటి క్రికెట్ గురించి మాట్లాడుకునేలా చేసిన కీపర్. చిరుత వేగంతో చేసే స్టంపింగ్స్.. స్టేడియం అవతల పడేలా బంతిని కొట్టే హెలికాఫ్టర్ స్టైల్ బ్యాటింగ్.. మిన్ను విరిగి మీద పడినా చలించని నైజం.. ఇవన్నీ ధోనీ కి మాత్రమే సాధ్యం. ఒక్కసారి టీమ్ జెర్సీ వేసుకున్నాకా.. గెలుపే లక్ష్యంగా పోరాడే స్ఫూర్తిని సహచరుల్లో నింపగలిగే నాయకత్వ పటిమ ధోనీ సొంతం. టీమిండియా కోసం ఆడిన ఆట ఒక ఎత్తైతే.. ఐపీఎల్ లో చెన్నై జట్టు కెప్టెన్ గా ఆటగాడిగా ధోనీ పాత్ర మరింత విశిష్టమైనది. ఐపీఎల్ లో చెన్నై జట్టును ఎవరికీ అందనంత ఎత్తుగా కూచోపెట్టిన ఘనత ధోనీదే అనడంలో సందేహం అక్కరలేదు. అయితే.. ఎంతటి వారైనా.. చివరికి పక్కకి జరగాల్సిందే కదా. ధోనీ అంతర్జాతీయ మ్యాచ్ ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నపుడు ఎక్కడా కూడా తన నుంచి భావోద్వేగ స్పందన లేదు. క్రికెట్ ఆడేటప్పుడు ఎంత కూల్ గా ఉంటాడో అంతే కూల్ గా అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు. అభిమానులు కలవర పడ్డారు కానీ, ధోనీ ఎక్కడా ఇబ్బంది పడినట్టు కనిపించలేదు. పైగా.. ఎవరైనా వెళ్లాల్సి వచ్చినపుడు గౌరవంగా వెళ్ళిపోవాలి అనే తత్వమే కనిపించింది. Dhoni Retairment: కానీ, ఐపీఎల్ విషయంలో మాత్రం ధోనీ స్టైల్ మారింది. చెన్నై విజయసారధిగా తనకున్న పేరో.. అభిమానుల్లో తనకు ఉన్న క్రేజ్ ని వదులుకోలేకో.. మరేదైనా కారణమేమో కానీ.. కొన్ని రోజులుగా చెన్నై టీమ్ కి వీడ్కోలు చెప్పాల్సిన పరిస్థితిలో మీనమేషాలు లెక్కపెడుతున్నట్టుగా ఉంది. అయినా.. కాలం ఆగదు కదా.. తప్పుకోవాల్సి సమయం తరుముకు వచ్చింది. మొదట కెప్టెన్ గా కొద్దికాలం క్రితం కిందికి దిగిపోయాడు ధోనీ. ఇప్పుడు ఆటగాడిగా కూడా రిటైర్మెంట్ కి దారి చూసుకోవాల్సిన స్థితి. ఈ నేపథ్యంలో ధోనీ కూడా ఎట్టకేలకు దాని కోసం సిద్ధం అయిపోయాడు. ఈ ఐపీఎల్ తన చివరి లీగ్ అని స్పష్టం చేశాడు. Also Read: ఆర్సీబీ అభిమానుల అతి.. చెన్నై ఫాన్స్ కు అవమానం.. తానొకటి తలిస్తే.. Dhoni Retairment: చెన్నైకి ధోనీకి ఉన్న అనుబంధం గురించి ఏ అభిమానిని అడిగినా గంటలకు గంటలు చెబుతూనే ఉంటాడు. దీంతో ధోనీ చెన్నై టీమ్ ను వీడడం విషయంలో కూడా ఒక లెక్క అనుకున్నాడు. ఈసారి ఐపీఎల్ లీగ్ ఫైనల్స్ చెన్నైలో జరుగుతున్నాయి. చెన్నై టీమ్ ఫైనల్స్ కి చేరుతుంది.. అక్కడ ఫైనల్స్ ఆడి గర్వంగా గుడ్ బై చెప్పేస్తాను అని ధోనీ చెప్పాడు. కానీ, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు.. ధోనీ అనుకున్నట్టు జరగలేదు. ఇప్పుడు ఆర్సీబీ చేతిలో చెన్నై ఓటమి పాలై ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. దీంతో ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడనేది సందిగ్ధంలో పడింది. అభిమానులు మాత్రం.. Dhoni Retairment: మరో పక్క ఈ ఓటమీ మా మంచికే అంటున్నారు ధోనీ అభిమానులు. ఇప్పుడు ధోనీ రిటైర్మెంట్ వాయిదా పడుతుంది అని వారికి నమ్మకాలు పెరిగాయంట. ఎందుకంటే, చెన్నైలో మ్యాచ్ అది రిటైర్ ఆవ్వాలనేది ధోనీ కోరిక. మరి ఇప్పుడు అవకాశం పోయింది కదా. అందుకని, వచ్చే సీజన్ కూడా ధోనీ ఐపీఎల్ ఆడతాడని వారు గట్టిగా భావిస్తున్నారు. పరుగులు చేసినా చేయకపోయినా.. ధోనీ టీమ్ లో ఉంటే ఆ అభిమానులకు చాలని చెబుతున్నారు. మరి వారి కోరిక తీరే ఛాన్స్ ఉందా? వచ్చే ఐపీఎల్ దాకా ధోనీ కష్టమే.. Dhoni Retairment: ధోనీ ఇక ఐపీఎల్ కు వీడ్కోలు చెప్పాలిందే అని అనిపిస్తోంది. ఎందుకంటే, వచ్చే ఐపీఎల్ వరకూ ధోనీ అడగలిగే ఫిట్ నెస్ ఉండకపోవచ్చు. ఇప్పటికే.. ధోనీ చివరి ఓవర్లలో బ్యాటింగ్ కు వస్తున్నాడు. పెద్దగా ఆడటం లేదు. అపుడపుడు ముందుగా వచ్చి ఆడినా పెద్ద స్కోర్లు చేయడం లేదనేది అంగీకరించవలసిన వాస్తవం. ఇంతకు ముందులా ధోనీ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడడం జరగడం లేదు. ఈ ఐపీఎల్ లో కూడా ధోనీ రికార్డ్ గొప్పగా ఏమీ లేదనేది ఒప్పుకుని తీరాల్సిందే. ఎందుకంటే, ధోనీ ప్రస్తుత ఆటతీరుతో మ్యాచ్ లు గెలిచే అవకాశం లేదనేది నిష్టుర సత్యం. Dhoni Retairment: ఇక వచ్చే ఐపీఎల్ కు ఆటగాళ్ల వేలం ఉంటుంది. సుమారుగా పన్నెండు కోట్లు పెట్టి మళ్ళీ ధోనీని చెన్నై టీమ్ మేనేజ్మెంట్ తీసుకుంటుందా? అనేది అనుమానాస్పదమే. ఎందుకంటే, ధోనీ ఒక్క మ్యాచ్ అది రిటైర్మెంట్ ప్రకటిస్తే.. అంత సొమ్ము వృధా కదా.. ఏ కోణంలో చూసినా ధోనీ ఇక ఐపీఎల్ నుంచి పక్కకు జరగడం తప్పనిసరిగా కనిపిస్తోంది. అభిమానులకు నచ్చినా నచ్చకపోయినా అదే జరిగే అవకాశం ఉంది. ఏదిఏమైనా ధోనీ - సీఎస్కే మధ్య ఏమి జరుగుతుందో తేలాలంటే కొంత సమయం పడుతుంది. అంతవరకూ మనం వేచి చూడాల్సిందే. #cricket #ms-dhoni మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి