ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద సీపీఐఎంఎల్ ప్రజాపంధా జంగారెడ్డిగూడెం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆదివాసీలకు, గిరిజనులకు, గిరిజనేతర పేద ప్రజలు సాగు చేస్తున్న పోడు భూములకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వాలని కోరుతూ, ఆదివాసీలు గిరిజన సాంప్రదాయ డోలు, కొయ్యలతో నృత్యాలు చేశారు. అరుణోదయ కళాకారులు డప్పు వాయిద్యాలతో నృత్య ప్రదర్శనగా ఆర్డీవో కార్యాలయం చేరుకుని ఆర్డీవో ఝాన్సీ లక్ష్మికి వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు.
అన్యాయానికి గురౌవుతున్న ఆదివాసీలు
సీపీఐఎంఎల్, ప్రజాపంధా రాష్ట్ర నాయకులు ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఆ నాటి నుండి నేటి వరకు ఆదివాసీలు, గిరిజనులు అన్యాయానికి గురి అవుతున్నారన్నారు. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం పాలక వర్గాలు కోట్లాది రూపాయాలు ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వాలు చెపుతున్నప్పటికి, అవి ఆదివాసీలకు చేరడంలేదని మండిపడ్డారు. మధ్య దళారులు, దోపిడిదారులు దోపిడి చేస్తున్నారని, పోడు భూములు సాగుచేస్తున్న ఆదివాసీ, గిరిజనేతర పేదలకు ఆర్‌వోఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడంలో పాలకులు విఫలమవుతున్నారన్నారు.
నిర్లక్ష్య వైఖరి
2006 అటవీ హక్కుల చట్టం రాకముందు అనేక ఉద్యమాలు, పోరాటాలు సీపీఐఎంఎల్, ప్రజాపంధా విప్లవకారులు, వామపక్ష పార్టీలు చేసాయని, అనేక మంది అమర వీరుల త్యాగఫలితమే 2006 అటవీ హక్కు చట్టమని, పోడు సాగుదారులకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం అమలులో పాలకవర్గాలు నిర్లక్ష్య వైఖరితో ఉన్నాయని ఆయన తెలిపారు.