Delhi Air Pollution: దేశ రాజధానికి ఢిల్లీలో వాయు కాలుష్యం కోరలు చాస్తుంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో గాలి నాణ్యత కనిష్ట స్థాయికి పడిపోతుంది. గాలి పీల్చుకోడానికి కూడా అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. శ్వాసకోశ సమస్య భారినపడే వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్లు కొన్ని వార్త కథనాలు పేర్కొంటున్నాయి. దేశరాజధానిలో గాలి నాణ్యతను పెంచేందుకు అక్కడి ఆప్ సర్కార్ పలు ఆంక్షలు పెట్టింది. ఇటీవలే స్కూళ్లకు, కాలేజీలకు ఈ నెల 10వ తేదీ వరకు సెలవులను ప్రకటించింది.
తాజాగా ఢిల్లీలో పాఠశాలలకు శీతాకాలం సెలవులు(Winter Holidays) ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. డిసెంబర్ నెలాఖరున ఇవ్వాల్సిన సెలవులను ముందుకు జరిపింది. నవంబర్ 9 నుంచి నవంబర్ 18 వరకు శీతాకాల సెలవులుగా ప్రకటించింది. అక్కడి ప్రైమరీ స్కూళ్ళు పూర్తిగా మూసివేయాలని.. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ లో పాఠాలు చెప్పాలని స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు నవంబర్ 13 నుండి నవంబర్ 20 వరకు ఒక వారం పాటు సరి-బేసి వాహన రేషన్ విధానాన్ని పునఃప్రారంభించనున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్(Gopal Rai) సోమవారం ప్రకటించారు. ఒకవేళ వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టకపోతే మరో వారం రోజులు సెలవులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు తెలిపారు.
వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు సీరియస్:
వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో నిన్న(మంగళవారం) విచారణ జరిగింది. పంట వ్యర్థాలను కాల్చడం ద్వారానే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన ధర్మాసనం.. పంట వ్యర్థాలను కాల్చే పద్ధతికి స్వస్తి పలకాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంజాబ్ తో పాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా పంట వ్యర్థాలను తగులబెట్టడాన్ని వెంటనే నిలిపివేయాలని తేల్చిచెప్పింది. దుమ్ము, వాహన కాలుష్యం, పొడి-చల్లని వాతావరణం, పంట వ్యర్థాలను కాల్చడం తదితర కారణాల వల్ల శీతాకాలంలో వాయు కాలుష్య స్థాయి పెరుగుతోంది.