డీసీపీతో కీలక చర్చ
భద్రత అంశంపై మేడ్చల్ డీసీపీ హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను ఆయన నివాసంలో కలిసారు. అరగంటకుపైగా ఈటలతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని ఇటీవల ఈటల, ఆయన సతీమణి జమున మీడియా ఎదుట వెల్లడించిన విషయం తెలిసిందే.
భద్రతపై పోలీస్‌శాఖ నిర్ణయం
దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఈటలకు వైకేటగిరి భద్రత కల్పించనున్నట్టు వార్తలు వచ్చాయి. కాగా, ఈటలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే భద్రత కల్పించాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు సీనియర్ పోలీస్ అధికారిని ఈటల ఇంటికి పంపించి భద్రతకు సంబంధించిన వివరాలు సేకరించాలని డీజీపీ అంజనీకుమార్‌కు సూచించారు. డీజీపీ ఆదేశాల మేరకు మేడ్చల్ ఏసీపీ వెంకట్‌రెడ్డిని వెంటబెట్టుకొని మేడ్చల్ డీసీపీ సందీప్ ఈటల ఇంటికి వెళ్లారు. దాదాపు అరగంటపాటు ఆయనతో మాట్లాడారు.
కౌశిక్‌రెడ్డి నుంచి ప్రాణహాని
ఈ సందర్బంగా కౌశిక్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉన్నట్టుగా ఈటల డీసీపీకి చెప్పినట్టు తెలిసింది. ఆ తర్వాత డీసీపీ ఈటల ఇంటి పరిసరాలను పరిశీలించారు. ఈటలతో భేటీ వివరాలను డీజీపీకి తెలియచేస్తానని డీసీపీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో ఈటల భద్రతపై పోలీస్‌శాఖ నిర్ణయం తీసుకొనున్నట్టు తెలిసింది.