Dead Man Comes Alive : ఇటీవల కాలంలో భారతదేశంలో రోడ్ల పై పడిన గుంతలు గురించి రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటు ఉండడం మనం చూస్తునే ఉంటాం. అంతేకాకుండా కొందరైతే ఈ గోతుల్లో పడుకుని మరీ రీల్స్ కూడా చేస్తుంటారు. ఇప్పటికే కొందరు హీరోలు, హీరోయిన్లు ఆ గోతుల గురించి తమ గళాన్ని వినిపించారు.
రోడ్ల మీద పడిన గుంతల్లో పడి ఎన్నో ప్రమాదాలు(Accidents) జరిగాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయాలు పాలయ్యారు. కానీ ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి గోతిలో పడడం వల్లే బ్రతికినట్లు అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల ప్రకారం... హర్యానా(Haryana) కు చెందిన దర్శన్ సింగ్ బ్రార్ (80) అనే వ్యక్తికి గత కొంత కాలంగా ఆరోగ్యం బాగుడండం లేదు. ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించగా గత నాలుగు రోజుల నుంచి ఆయన వెంటిలేటర్(Ventilator) మీదనే ఉన్నాడు.
శుక్రవారం దర్శన్ సింగ్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించడంతో ఆయన మనవుడు అంబులెన్స్(Ambulance) లో ఆయన్ని తీసుకుని పాటియాలా నుంచి కర్నాల్ సమీపంలోని వారి ఇంటికి బయల్దేరారు. ఇంటి వద్ద అంత్యక్రియలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను కుటుంబ సభ్యులు మొదలు పెట్టేశారు కూడా.
అంబులెన్స్ ఓ గోతిలో పడడంతో
ఇంటికి వెళ్తున్న క్రమంలో అంబులెన్స్ ఓ గోతిలో పడడంతో దర్శన్ సింగ్ ఒక్కసారిగా కదిలాడు. అది గమనించిన అతని మనవడు అతని వద్దకు వెళ్లి పరిశీలించగా చేయి కదపడంతో పాటు గుండె కొట్టుకోవడం(Heart Beat) కూడా గమనించాడు. వెంటనే అంబులెన్స్ డ్రైవర్ దగ్గరకు వెళ్లి దగ్గరలోని ఆసుపత్రికి తీసుకుని వెళ్లామని కోరాడు.
చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి బతకడం..
అక్కడికి తీసుకుని వెళ్లగా వైద్యులు దర్శన్ బ్రార్ ని పరిశీలించి అతను ఇంకా బతికే ఉన్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కానీ అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి బతకడం నిజంగా అద్బుతమంటూ దర్శన్ కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.
ఈ విషయం గురించి స్థానిక ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నేత్రపాల్ మాట్లాడుతూ..'' రోగి చనిపోయాడని మాకు తెలియదు. అతను మా వద్దకు వచ్చేసరికి అతను ఊపిరి తీసుకుంటున్నాడు. అంతేకాకుండా అతని పల్స్ కూడా బాగానే ఉంది. ఇంతకు ముందు ఆయన్ని చేర్చిన ఆసుపత్రిలో ఏం జరిగిందో మాకు తెలియదు. బహుశా ఆసుపత్రిలో ఏదైనా సాంకేతిక లోపం వల్ల రోగి చనిపోయినట్లు వారు చెప్పి ఉండవచ్చు అంటూ పేర్కొంటున్నారు.
రోగి గత నాలుగు రోజులుగా పాటియాలాలోని వెంటిలేటర్ పై ఉన్నాడు. ఇప్పుడు తానంతట తానే శ్వాస తీసుకుంటున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ అతని కండిషన్ మాత్రం సీరియస్ గానే ఉంది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నాడు.అతని ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉన్నందున శ్వాస తీసుకోవడం చాలా శ్రమతో కూడుకున్నది" అని డాక్టర్ వివరించారు.
Also read: గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ మంత్రి.. ప్రతి టికెట్ పై 55 శాతం రాయితీ!