Dead Body Found in Nalgonda Water Tank: తాగేనీటిలో క్రిమి కీటకాలు ఉంటేనే భయపడతాం.. ఏకంగా కోతుల కళేబరాలు.. డెడ్ బాడీ ప్రత్యక్షమైతే? ఆ నీటిని తాగితే వణికిపోతాం. నల్లగొండ జిల్లాలో ప్రజల పరిస్థితి ప్రస్తుతం ఇదే. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం అక్కడి ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా ఉంది. ఇటీవలే వాటర్ ట్యాంకులో కోతులు పడి చనిపోయిన ఘటన మరువక ముందే మంచి నీటి ట్యాంకులో శవం ప్రత్యక్షమైన ఘటన కలకలం రేపింది. వరుస సంఘటనలతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఇటీవలే నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ ఒకటవ వార్డు విజయ విహార్ దగ్గర ఉన్న వాటర్ ట్యాంకులో 40 కోతుల కళేబరాలు కనిపించడం సంచలనం రేపింది. వాటర్ ట్యాంకుపై ఉన్న రేకులు మూత తెరిచి ఉండటంతో కోతులు లోపలికి వెళ్లి బయటకు రాలేని పరిస్థితిలో మరణించాయి. ఈ ఘటనను జనం మర్చిపోకముందే మరో ఘోరం జరిగింది. నల్లగొండ మున్సిపాలిటీ 11వ వార్డు పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో శవం ప్రత్యక్షమవడంతో జనం ఉలిక్కిపడ్డారు. ఆ డెడ్ బాడీ హనుమాన్ నగర్ కి చెందిన ఆవుల వంశీగా గుర్తించారు. కాగా ఈ విషయం తెలియక గత పదిరోజులుగా ఆ ప్రాంత ప్రజలు ఈ నీటిని తాగుతున్నారు. దీంతో వారంతా వణికిపోతున్నారు. ప్రజల ఆరోగ్యంపై అధికారులకు ఏ మాత్రం బాధ్యత లేకపోవడంపై మండిపడుతున్నారు. ఈ రెండు సంఘటనలు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి.
ఇక ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. వాటర్ ట్యాంకులలో కోతులు పడి చనిపోయినా పట్టించుకోరని..పదిరోజులుగా నీటి ట్యాంకులో శవం ఉన్నా నిద్ర లేవరని దుయ్యబట్టారు. ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిన గలీజు పాలన చూస్తున్నామంటూ కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ తీరు మారకపోతే ప్రజలు కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టడం ఖాయమంటూ కేటీఆర్ పోస్టు పెట్టారు.
Also Read: పాక్ ISIతో సంబంధాలు.. బ్రహ్మోస్ ఏరోస్పేస్ మాజీ ఇంజనీర్ కు జీవిత ఖైదు!