Cyber Kidnapping: ఈమధ్య వచ్చిన రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా చూశారా? అందులో దొంగతనం చేయడానికి ఒళ్ళంతా నూనె పూసుకుని.. గోడలకు కన్నాలు వేసి వెళుతుంటారు. అప్పట్లో దొంగతనం అంటే అలా.. మరి ఇప్పుడో.. ప్రపంచం స్మార్ట్ అయిపొయింది. దొంగతనం కూడా స్మార్ట్ గా మారిపోయింది. అలాగే చాలా సార్లు కిడ్నాప్ ల గురించి వినే ఉంటారు. బాగా డబ్బున్న ఇంట్లో పిల్లలు లేదా ముఖ్యమైన వాళ్ళను కార్లేసుకుని వచ్చి ఎత్తుకెళ్ళి.. ఒక గదిలో కట్టి పాడేసి.. ఆనక ఆ ఇంటి యజమానికి ఫోన్ చేసి డబ్బు ఇవ్వకపోతే చంపేస్తాం అని క్రూరంగా బెదిరిస్తారు. ఒక్కోసారి డీల్ సెట్ కాకపొతే, కిడ్నాప్ మర్డర్ అయిపోవడమూ చాలాసార్లు మనం విన్నాం. చాలా సినిమాల్లో ఇలాంటి సీన్స్ చూసాం. ఈ విధానమూ పాతది అయిపోయింది. ఇప్పుడు హై టెక్ కిడ్నాప్ విధానం వచ్చేసింది. అవును.. టెక్నాలజీతో కిడ్నాప్ (Cyber Kidnapping)చేసి డబ్బు గుంజేసే విధానం వచ్చింది. అదే సైబర్ కిడ్నప్! పేరు వింటే ఇది కంప్యూటర్స్-ఇంటర్నెట్ కి సంబంధించిన వ్యవహారంలా కనిపిస్తోంది కదూ. కానీ, ఇది మనుషులను టెక్నాలజీతో కిడ్నాప్ చేయడం. ఏమిటి అర్ధం కాలేదా? ఈ కథనం పూర్తిగా చదవండి.. అర్ధం అవుతుంది.
ప్రస్తుతం సైబర్ కిడ్నాప్ (Cyber Kidnapping)అనే పదం చాలా పెద్ద విషయంగా మారింది. తాజాగా, అమెరికాలోని ఉటా నగరంలో 17 ఏళ్ల చైనీస్ చిన్నారిని కిడ్నాప్ చేశారు. కిడ్నపర్లు ఆ అమ్మాయిని ముట్టుకోలేదు. కనీసం దగ్గరగా వెళ్లి వేధించనూ లేదు. కానీ ఆ అమ్మాయి కిడ్నప్ అయింది. ఆమె పేరెంట్స్ కి కిడ్నపర్ల బెదిరింపులు వచ్చాయి. చివరికి భారీ మొత్తం వసూలు చేశారు. ఆ తరువాత ఆ చిన్నారి ఉన్న ప్రాంతం చెప్పి కిడ్నాపర్లు మాయం అయిపోయారు. ఇందులో ఎక్కడా భౌతికంగా కిడ్నాపర్లు ఎవరికీ కనిపించలేదు. కేవలం వినిపించారు అంతే. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ.
కిడ్నాపర్లు ఏం చేశారంటే..
ముందు తాము కిడ్నాప్ (Cyber Kidnapping)చేయాలనుకున్నచిన్నారికి సంబంధించిన అన్ని వివరాలు సేకరించారు. తరువాత ఆ చిన్నారికి ఫోన్ చేసి వారి ఇంటి దగ్గరలో ఉన్న ఒక మంచు పర్వతం వద్దకు వెళ్లాలని లొకేషన్ చెప్పారు. అలా వెంటనే వెళ్లకపోతే ఆ బాధితురాలి తల్లిదండ్రులను చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆమె కిడ్నాపర్లు చెప్పిన లొకేషన్ కి వెళ్ళింది. అక్కడకు ఆమె చేరుకున్న తరువాత కిడ్నాపర్స్ బాధితురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. వారి కూతుర్ని కిడ్నాప్ చేశామని చెప్పారు. చాలా పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. తరువాత ఆ డబ్బు అందుకుని వారు మాయం అయిపోయారు. విషయం పోలీసులకు చేరింది. పోలీసుల దర్యాప్తులో అసలు ఆ బాధితురాలు కిడ్నాప్ కాలేదని తేలింది.
సైబర్ కిడ్నాప్ అంటే ఏమిటి?
ఇతర ఆన్‌లైన్ మోసాల మాదిరిగానే, సైబర్ కిడ్నాప్ కూడా సైబర్ నేరాల(Cyber Kidnapping) పద్ధతి. ఇందులో, నేరస్థుడు ఇంటర్నెట్ సహాయంతో వ్యక్తి మొత్తం సమాచారాన్ని సేకరించి, ఆపై అతనికి కాల్ చేస్తాడు. బెదిరించడం, భయపెట్టడం, అతని కుటుంబ సభ్యులకు హాని కలిగించడం ద్వారా అతను సూచించిన ప్రదేశానికి వెళ్లమని అతను వ్యక్తిని అడుగుతాడు. వీడియో కాల్‌లు లేదా ఫోటోలను పంపించమని చెప్పి.. ఆ బాధితుడి రియల్ లొకేషన్ ఎప్పటికప్పుడు గమనిస్తారు. మరోవైపు, ఆమె ఇంటికి కాల్ చేసి, నకిలీ ఫోటోలు లేదా వీడియోలను పంపడం ద్వారా వ్యక్తిని కిడ్నాప్ చేసినట్లు చెబుతారు. వాస్తవానికి కిడ్నాప్ జరగదు. కొంతమంది నేరస్థులు బాధితురాలి నకిలీ చిత్రం, వాయిస్ లేదా వీడియోని సృష్టించడానికి AI సహాయం తీసుకుంటున్నారు. ఈ నేరస్తులు ఎవరినైనా తమ బలిపశువుగా చేసుకోవచ్చు. అయితే, కుటుంబానికి దూరంగా మరొక రాష్ట్రం లేదా దేశంలో నివసించే వ్యక్తులు లేదా విద్యార్థులు ఎక్కువగా ఇటువంటి సైబర్ మీడియా(Cyber Kidnapping) బారిన పడే ప్రమాదంలో ఉన్నారు.
తప్పించుకోవాలంటే ఏమి చేయాలి?
సోషల్ మీడియా లేదా మెసెంజర్‌లలో మీ వ్యక్తిగత సమాచారాన్ని జాగ్రత్తగా పంచుకోండి. కుటుంబం గురించి, వారు ఎక్కడ నివసిస్తున్నారు లేదా వారి దినచర్య ఏమిటో సోషల్ మీడియాలో ఎవరితోనైనా సరే షేర్ చేసుకోవడం మానుకోండి. చాలా మంది, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, ఎన్ని రోజుల తర్వాత వారు తమ సొంత నగరానికి తిరిగి వచ్చారనే విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. చాలా మంది వ్యక్తులు తమ ప్లానర్ ఫోటోను కూడా షేర్ చేస్తారు. సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఎవరైనా ఒకరు నేరస్థుడు కావచ్చు. వారు మీ సమాచారం గమనించే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా తెలియని లింక్‌పై క్లిక్ చేయడం మానుకోండి. మొబైల్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తూ ఉండండి. బలమైన పాస్‌వర్డ్‌లను కలిగి ఉండండి.
Also Read: పేటీఎం కు భారీ ఊరట.. ఆ విషయంలో ED క్లీన్ చిట్!
సైబర్ కిడ్నాప్ బారి నుంచి ఎలా తప్పించుకోవచ్చు?
ఎపుడైనా మీరు కిడ్నప్ కి సంబంధించిన కాల్ వస్తే.. ముందుగా బాధితులతో మాట్లాడించమని అడగండి. వీడియో కాల్ చేయమని చెప్పండి. అలాగే.. కిడ్నాప్ అయ్యారని చెబుతున్న వారి ఫోన్ ద్వారా నేరుగా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించండి. దీనివలన విషయం అర్ధం అయిపోతుంది.
మీకు ఫోన్ (Cyber Kidnapping)చేస్తున్న వారి స్వరాన్ని జాగ్రత్తగా వినండి. అతను మాట్లాడే విధానం.. వెనుక నుండి వచ్చే శబ్దాలపై శ్రద్ధ వహించండి. ఇది నేరస్థుడిని చేరుకోవడానికి సహాయపడుతుంది. వీలైతే, అదే సమయంలో మరొక ఫోన్ నుండి బాధితుడిని సంప్రదించండి. వారితో మాట్లాడితే వారు క్షేమంగా ఉన్నారని అర్ధం అవుతుంది. ఎందుకంటే, సైబర్ కిడ్నాప్ లో కిడ్నాప్ చేసిన వ్యక్తికీ దగ్గరలో కిడ్నాపర్లు ఉండే ఛాన్స్ లేదు. అసలు వాళ్ళు నేరుగా క్రైమ్ సీన్ లో కనిపించే ప్రయత్నమే చేయరు. అలాగే, కిడ్నాప్ చేసినవారిని ఫోన్ లోనే బెదిరిస్తారు. వారేం చేయాలో చెబుతారు. అందువల్ల బాధితుల ఫోన్ పనిచేస్తూనే ఉంటుంది. బెదిరింపు కాల్ వచ్చిన వెంటనే, వేరే ఫోన్ ద్వారా బాధితుల ఫోన్ కి కాల్ చేస్తే విషయం క్లియర్ అయిపోతుంది. కిడ్నాప్ కాల్ వస్తే భయపడటం మానుకోవాలి. జాగ్రత్తగా ఆలోచించాలి.
కుటుంబ సభ్యులకు చెప్పండి...
ఏదైనా అనుమానాస్పదంగా అనిపించినా కాల్.. లేదా బెదిరింపు కాల్ వస్తే కనుక మీరు వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పండి. దీంతో వారు అప్రమత్తం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీకు వచ్చిన కాల్ స్క్రీన్ షాట్ తీసుకోండి. వారు మీతో మాట్లాడినపుడు వాయిస్ రికార్డ్ అయ్యేలా చేసుకోండి.
మొత్తమ్మీద సైబర్ క్రైమ్స్ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. అందుకే టెక్నాలజీ వాడకం విషయంలో ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక ఈ సైబర్ క్రైమ్ అర్ధం అయింది కదా.. చేతికి మట్టి అంటుకోకుండా.. ఎటువంటి ఆధారాలు లేకుండా టెక్నాలజీ వాడుకుని చిన్న డ్రామాతో డబ్బును దోచేస్తారు. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండటమే ఇటువంటి మోసాల బారిన పడకుండా మనల్ని కాపాడేది.
Watch this Interesting Video: