/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Prajapalana-application-cyber-fraud--jpg.webp)
Praja Palana Applicants: తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) వాటిని అమలు చేయడానికి దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,25,84,383 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ దరఖాస్తులపై సైబర్ నేరగాళ్ల (Cyber Crime) కన్నుపడింది. దరఖాస్తుదారులను టార్గెట్ చేసిన నేరగాళ్లు ఓటీపీలు అడిగి డబ్బులు కాజేస్తున్నారు.
రాష్ట్రం లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అభయహాస్తం, రేషన్ కార్డులు, చేయూత, పక్కా ఇండ్లు, రైతుభరోసా, గృహ జ్యోతి తదితర పథకాల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నది. వాటిని ఆన్ లైన్ లో అప్ డేట్ చేసేందుకు ప్రభుత్వం కొంతమంది డాటా ఆపరేటర్లను నియమించింది. వారు వారి పనిలో ఉంటే ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు ప్రజలకు వల విసురుతున్నారు. దరఖాస్తుల్లో తప్పులు ఉన్నాయని చెప్తూ వారినుంచి డబ్బులు గుంజుతున్నారు.
ఇది కూడా చదవండి: Bandi Sanjay: మేము గెలిచుంటే కేటీఆర్‌ను జైళ్లో పెట్టేవాళ్ళం.. బండి సంజయ్ గరం
తాజాగా నిజామాబాద్ (Nizamabad) జిల్లా బర్దిపూర్ గ్రామానికి చెందిన మహిళ కేటుగాళ్ల మాయలో పడి 10 వేలు పోగొట్టుకుంది. ఆమెకు పోన్ చేసిన సైబర్ నేరగాళ్లు వారు దరఖాస్తు చేసిన ప్రజాపాలన దరఖాస్తు సరిగా లేదని, దాన్ని సరిచేయాలంటే ఆమె ఫోన్ నెంబరుకు వచ్చిన ఓటీపీ చెప్పాలని కోరారు. నిజమేనని నమ్మిన ఆమె ఓటీపీ చెప్పగానే వెంటనే ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.10 వేలు విత్‌డ్రా అయినట్లు మెస్సేజ్ వచ్చినట్టు తెలిసింది. దీంతో లబోదిబో అనటం ఆ బాధితురాలివంతయ్యింది.
సైబర్ నేరగాళ్ల చేతిలోకి ఎలా..
ప్రజాపాలన దరఖాస్తులను ప్రభుత్వ అధికారులు స్వీకరించారు. వాటిని ఆన్ లైన్ చేసే బాధ్యతను కొన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ఇటీవల ఆ దరఖాస్తులను కంప్యూటర్ల కేంద్రాలకు తరలిస్తున్నసమయంలో రోడ్డుపై పడిపోయిన విషయం తెలిసిందే. ఆపరేటర్లు సైతం దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో లబ్ధిదారుల పోన్ నెంబర్లు సైబర్ నేరగాళ్ల చేతికి ఎలా వెళ్లాయన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రైవేటు అపరేటర్ల నిర్వాకం వల్లే ఇలా జరుగుతుందన్న ఆరోపణలు వినవస్తున్నాయి.
కాల్స్ కు స్పందించవద్దు
కాగా ప్రజాపాలన దరఖాస్తుల విషయంలో అధికారులు ఎలాంటి ఓటీపీలు అడగరని, అలా అడిగితే ఎవరూ స్పందించవద్దని పోలీసులు, అధికారులు కోరుతున్నారు. ఈ విషయంలో దరఖాస్తుదారులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
భట్టి మాటలు వినకండి
నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళ సైబర్ నేరగాళ్ల బారిన పడిన సందర్భాన్ని గుర్తు చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. ప్రజలు ఎవరికీ తమ ఓటీపీలను షేర్ చేయవద్దని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాటలు విని డబ్బులు పోగొట్టుకోవద్దని కోరారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ప్రజా పాలన దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దరఖాస్తుల్లో ప్రజలకు సంబంధించిన సున్నితమైన డాటా ఉందని దాన్ని సైబర్ నేరగాళ్ల పాలవ్వకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.