Telangana Rains: తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 11 జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. రానున్న 24గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిందని తెలిపారు.
మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, , సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ జిల్లాల్లో వరద పరిస్థితులు, పునరావాసం, సహాయక చర్యలపై సమీక్షించారు. డీజీపీ జితేందర్, విపత్తుల నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఈ టెలీకాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు ముందు జాగ్రత్తలు తీసుకొని.. ఆస్తి, ప్రాణనష్టం జరుగకుండా చూడాలన్నారు. ఇప్పటికే గత నాలుగైదు రోజులుగా వానలుపడుతున్నాయని, రానున్న భారీ వర్షాలతో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయన్నారు. పోలీస్, తదితరశాఖలతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Also Read: ప్రకాశం బ్యారేజ్‌కు 15 రోజుల్లో కొత్త గేట్లు.. కన్నయ్య నాయుడు కీలక ప్రకటన!