Maharashtra: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గత రెండు రోజుల నుంచి వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మొసళ్లు రోడ్లపై దర్శనమిస్తూ, వాహనదారులను భయానికి గురి చేస్తున్నాయి. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో భారీ వర్షం కురవడంతో.. ఓ మొసలి నడిరోడ్డుపై దర్శనం ఇచ్చింది.
అయితే ఈ మొసలి స్థానికంగా ఉన్న శివ నదిలో నుంచి బయటకు వస్తున్నట్లు వాహనదారులు, పోలీసులు తెలిపారు. శివ నది మొసళ్లకు నిలయంగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వరద ఉధృతికి మొసలి రోడ్డుపైకి వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక రోడ్డుపై హల్‌చల్ సృష్టించిన మొసలిని వాహనదారులు తమ కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రోడ్డుపై ప్రత్యక్షమైన మొసలి.. నోరు పెద్దగా తెరుస్తూ వాహనాల వెంట పడింది. మరో రెండు రోజుల పాటు రత్నగిరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Also read: మీకు సేవకులుగా ఉంటాం..పెత్తందారులుగా కాదు..పెన్షన్ల కార్యక్రమంలో ఏపీ సీఎం!