Case Filed on Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. మార్చి 25న కోర్టుకు హాజరు కావాలని పవన్ కల్యాణ్‌కు నోటీసులు పంపారు. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు నమోదైంది. తాడికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీర్ పవన్ కుమార్ కంప్లైంట్ ఇచ్చాడు. సెక్షన్ 499,500 కింద క్రిమినల్ కేసు రిజిస్టర్ అయ్యింది. పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేశారు నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు.
సంఘవిద్రోహ శక్తులకు సమాచారం ఇస్తున్నారు: పవన్
జులై 9న వారాహి యాత్రలో భాగంగా ఏలూరు సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. 20 వేల నుంచి 30 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని పవన్ కల్యాణ్ చెప్పడం అగ్గి రాజేసింది. పవన్ వ్యాఖ్యలు వాలంటీర్ల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ప్రభుత్వంపై బురద చల్లేలా ఉన్నాయని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం. వాలంటీర్ల ద్వారా అందరి సమాచారం సేకరించి ఒంటరి మహిళల గురించి సంఘవిద్రోహ శక్తులకు అప్పగించారని పవన్ ఆరోపించారు. ఇందులో కొంతమంది వైసీపీ ప్రభుత్వంలోని పెద్దల హస్తం ఉందని కేంద్ర నిఘావర్గాల తనకు చెప్పాయన్నారు పవన్. అదృశ్యమైన ముప్పైవేలమంది అమ్మాయిలలో పద్నాలుగు వేలమంది తిరిగి వచ్చారని, మిగిలినవారి సంగతేంటని పవన్ ప్రశ్నించారు.
మరోసారి రచ్చ తప్పదా?
పవన్ వ్యాఖ్యలపై దాదాపు అన్ని జిల్లాల్లోని వాలంటీర్లు అప్పట్లో నిరసనకు దిగారు. పవన్ దిష్టి బొమ్మల్ని దగ్దం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా వ్యవహరిస్తున్న తమను పవన్ ఇన్నేసి మాటలు ఎలా అంటారని ప్రశ్నించారు. వాలంటీర్లకు రాజకీయాల్ని ఆపాదించి, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటూ అవమానించడం దారుణమని మండిపడ్డారు. రాజకీయాలు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అని.. అనవసరంగా తమపై బురద జల్లే కార్యక్రమం మాత్రం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని.. ఎక్కడో నిలబడి.. ఏదో మాట్లాడితే సరిపోదని.. నిజనిజాలు తెలుసుకోని మాట్లాడితే మంచిదని ఫైర్ అయ్యారు. ఇక కేంద్రం దగ్గర సమాచారం ఉంటే..నిఘా సంస్థల ద్వారా దర్యాప్తు చేసుకోవచ్చు కదా అని నిలదీశారు. గతేడాది జులైలో జరిగిన ఈ గొడవంతా మళ్లీ ప్రారంభమయ్యేలా కనిపిస్తోంది. మరోవైపు ఎన్నికలకు కూడా సమయం దగ్గరపడుతోంది.
Also Read: ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన?