/rtv/media/media_files/2025/10/02/thunderstorm-7-dead-including-father-and-son-2025-10-02-07-09-02.jpg)
Thunderstorm 7 Dead Including Father and Son
గత కొన్ని రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ వరదలు పలు గ్రామాలను తుడిచిపెట్టేశాయి. ఎంతో మంది ఈ ప్రకృతి విళయానికి ప్రాణాలు కోల్పోయారు. మరెందరో నిరాశ్రయులయ్యారు. అందువల్ల వర్షా కాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా పచ్చటి చెట్ల కింద ఉండకూడదంటూ చెబుతున్నారు. అలా ఉంటే పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నారు. కానీ తరచూ ఏదో ఒక చోట పిడుగుపాటుకు గురై చనిపోయినవారెందరో ఉన్నారు. తాజాగా అలాంటి విషాద సంఘటనే జరిగింది.
పిడుగుపాటుకు 7 గురు మృతి
మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో పిడుగుపాటు విధ్వంసం సృష్టించింది. సదర్ తహసీల్ ప్రాంతంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు తండ్రి, కొడుకు సహా ఏడుగురు మరణించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు, రెవెన్యూ శాఖ బృందాలు.. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపాయి. మృతుల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉండటంతో వారికి సాధ్యమైనంత సహాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
#BreakingNews: UP's Fatehpur: Devastation from Lightning Strike, 7 Dead Including Father and Son. #Fatehpur#LightningStrikepic.twitter.com/2yjiyNKKuB
— Breaking News World wide (@News1stShot1) October 1, 2025
తొలి కేసు ఫతేపూర్‌లోని ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ 75 ఏళ్ల రిటైర్డ్ రైల్వే ఉద్యోగి దేశ్‌రాజ్ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించాడు. సిమోర్‌లోని బంధువుల ఇంట్లో జరిగిన ముండన్ వేడుక నుండి రిసెప్షన్‌కు హాజరై తిరిగి వస్తుండగా భారీ వర్షం పడింది. దీంతో దేశ్‌రాజ్ మార్గమధ్యలో ఉన్న ఒక మర్రి చెట్టు కింద ఆగిపోయాడు. ఇంతలో భారీ పిడుగుపాటు దేశ్‌రాజ్‌ను తాకింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో మృతుని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
మరో సంఘటన అసోతర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జరౌలి గ్రామంలో జరిగింది. ప్రాథమిక పాఠశాల వెనుక ఉన్న అడవిలో పశువులను మేపుతున్న ఇద్దరు యువకులు పిడుగుపాటుకు గురయ్యారు. నీరజ్ గుప్తా, కల్లు గుప్తా అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి విపిన్ రైదాస్‌ను సమీపంలోని కమ్యూనిటీ సెంటర్‌కు తరలించగా.. అక్కడ అతడు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
అలాగే లాలౌలి జిల్లాలోని దాతౌలి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి 36 ఏళ్ల రవి పాల్, తన 14 ఏళ్ల కుమారుడు రిషబ్‌తో కలిసి మధ్యాహ్నం తమ గొర్రెలను మేపడానికి అడవికి వెళ్ళాడు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో ఇద్దరూ దాక్కోవడానికి సమీపంలోని చెట్టు కింద నిలబడ్డారు. ఇంతలో పిడుగుపాటు చెట్టును తాకడంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు.
Follow Us