అధికారుల నిర్లక్ష్యానికి.. 5 రోజుల్లో రెండు ప్రాణాలు బలి

ఢిల్లీలో అధికారుల నిర్లక్ష్యం వరుసగా ప్రాణాలను బలితీసుకుంటోంది. జనక్‌పురిలో ఓ బైకర్ గొయ్యిలో పడి మరణించిన ఘటన మరువక ముందే, కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే రోహిణి ప్రాంతంలో మరో వ్యక్తి మ్యాన్‌హోల్‌లో పడి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.

New Update
delhi manwhole

ఢిల్లీలో అధికారుల నిర్లక్ష్యం వరుసగా ప్రాణాలను బలితీసుకుంటోంది. జనక్‌పురిలో ఓ బైకర్ గొయ్యిలో పడి మరణించిన ఘటన మరువక ముందే, కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే రోహిణి ప్రాంతంలో మరో వ్యక్తి మ్యాన్‌హోల్‌లో పడి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. వాయవ్య ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 32లో ఈ విషాదం చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన బిర్జూ కుమార్(30) అనే కార్మికుడు సోమవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి ఇంటికి వెళ్తుండగా, ఓపెన్ మ్యాన్‌హోల్‌లో ప్రమాదవశాత్తూ పడిపోయాడు. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో మ్యాన్‌హోల్‌కు కనీసం మూత లేకపోవడం ఈ ప్రమాదానికి కారణం.

ప్రమాదం జరిగిన సమయంలో బిర్జూ కుమార్ తన స్నేహితుడు బుధన్ దాస్‌తో కలిసి ఉన్నాడు. అయితే వారు మద్యం మత్తులో ఉండటంతో, బిర్జూ మ్యాన్‌హోల్‌లో పడిపోయిన విషయాన్ని అతని స్నేహితుడు అప్పట్లో గుర్తించలేకపోయాడు. మరుసటి రోజు మధ్యాహ్నం స్పృహలోకి వచ్చాక తన స్నేహితుడు కనిపించకపోవడంతో గాలించగా, మ్యాన్‌హోల్‌లో బిర్జూ మృతదేహం లభ్యమైంది. పోలీసులు సుమారు 6 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని వెలికితీశారు.

ఐదు రోజుల ముందే జనక్‌పురిలో

ఈ ఘటనకు సరిగ్గా ఐదు రోజుల ముందు ఫిబ్రవరి 6న పశ్చిమ ఢిల్లీలోని జనక్‌పురిలో కమల్ ధ్యానీ (25) అనే యువకుడు ఇలాంటి ప్రమాదానికే బలయ్యాడు. ఢిల్లీ జల్ బోర్డు రోడ్డు మధ్యలో 15 అడుగుల లోతైన గుంతను తవ్వి, ఎటువంటి హెచ్చరిక బోర్డులు లేదా బారికేడ్లు లేకుండా వదిలేసింది. రాత్రి సమయంలో బైక్‌పై వెళ్తున్న కమల్ ఆ గుంతను గమనించలేక అందులో పడిపోయి అక్కడికక్కడే మరణించాడు. వరుస మరణాలతో ఢిల్లీ ప్రభుత్వం, అడ్మినిస్ట్రేషన్ మీద ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. జనక్‌పురి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు వాటర్ బోర్డు ఇంజనీర్లను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. సంబంధిత కాంట్రాక్ట్ సంస్థపై కేసు నమోదు చేసి, ఇద్దరు డైరెక్టర్లను పోలీసులు విచారిస్తున్నారు. ఈ మరణాలపై ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికారుల నిర్లక్ష్యమే ఈ "హత్యలకు" కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజధాని నగరంలో ఇలాంటి మౌలిక సదుపాయాల వైఫల్యాలు సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు