జల్లికట్టులో విషాదం.. ముగ్గురు మృతి, 76 మందికి పైగా తీవ్ర గాయాలు

తమిళనాడు సంస్కృతిలో భాగమైన జల్లికట్టు పోటీలు శివగంగై జిల్లా సిన్గంపునారి సమీపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే, పోటీల సమయంలో బరిలోకి దిగిన ఎద్దులు ఒక్కసారిగా అదుపు తప్పి ప్రేక్షకులపైకి దూసుకెళ్లాయి. అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

New Update
Jallikattu

తమిళనాడులోని శివగంగై జిల్లాలో జరిగిన జల్లికట్టు పోటీలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆనందోత్సాహాల మధ్య సాగాల్సిన ఈ వేడుకలో ఊహించని ప్రమాదం జరగడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. తమిళనాడు సంస్కృతిలో భాగమైన జల్లికట్టు పోటీలు శివగంగై జిల్లా సిన్గంపునారి సమీపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే, పోటీల సమయంలో బరిలోకి దిగిన ఎద్దులు ఒక్కసారిగా అదుపు తప్పి ప్రేక్షకులపైకి దూసుకెళ్లాయి. రక్షణ కవచాలను దాటుకుని ఎద్దులు విరుచుకుపడటంతో అక్కడ తొక్కిసలాట వంటి పరిస్థితి నెలకొంది.

ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 76 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బాధితులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

ప్రతి ఏటా వేలాది మంది హాజరయ్యే ఇలాంటి పోటీల్లో భద్రతా ఏర్పాట్లు సరిగా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎద్దులు ప్రేక్షకుల గ్యాలరీలోకి రాకుండా ఉండాల్సిన బారికేడ్లు బలహీనంగా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పండుగ పూట ఇళ్లలో విషాదం నిండటంతో ఆ ప్రాంతమంతా కన్నీరుమున్నీరవుతోంది.

Advertisment
తాజా కథనాలు