/rtv/media/media_files/2026/02/05/crime-2026-02-05-19-58-11.jpg)
ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఒక ఎన్నారైని డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం చేసి, అక్షరాలా రూ. 48 లక్షలు కాజేసిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్‌కు చెందిన ఈ యువకుడు ప్రస్తుతం సిడ్నీలో ఉంటుండగా, సైబర్ నేరగాళ్లు అతడిని సుమారు నెల రోజుల పాటు భయాందోళనకు గురిచేసి ఈ భారీ దోపిడీకి పాల్పడ్డారు.
ఆగస్టు 26, 2025న బాధితుడికి ఒక వాట్సాప్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తులు తాము 'ముంబై క్రైమ్ బ్రాంచ్' అధికారులమని పరిచయం చేసుకున్నారు. బాధితుడి బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబర్ ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని, దీనిపై విచారణ చేయాలని అతడిని బెదిరించారు.
నేరగాళ్లు బాధితుడిని మానసికంగా దెబ్బతీసేందుకు నిరంతరం వీడియో కాల్ ద్వారా నిఘాలో ఉంచారు. కెమెరా ముందు నుండే కదలకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదని ఆజ్ఞాపించారు. ఒకవేళ మాట వినకపోతే ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేస్తారని, ఇండియాకు వస్తే ఎయిర్‌పోర్ట్‌లోనే అదుపులోకి తీసుకుంటామని భయపెట్టారు. చివరకు అతడి చేత కొత్త ఫోన్ కొనిపించి, సాఫ్ట్వేర్ ద్వారా బాధితుడి ల్యాప్‌టాప్, ఫోన్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
రెండు విడతలుగా నగదు దోచేశారు
విచారణ పేరుతో బాధితుడి బ్యాంక్ వివరాలు సేకరించిన కేటుగాళ్లు రెండు విడతలుగా నగదు దోచేశారు. ఆస్ట్రేలియా ఖాతా నుండి సుమారు రూ. 14 లక్షలు.. అహ్మదాబాద్‌లోని యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఉన్న రూ. 34 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్‌ను క్యాన్సిల్ చేయించి మరీ ఆ సొమ్మును కాజేశారు. విచారణ పూర్తయ్యాక డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేస్తామని నమ్మబలికిన నేరగాళ్లు, చివరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు.
నెల రోజుల పాటు ఒంటరిగా, నిఘా నీడలో గడిపిన బాధితుడు, తాను మోసపోయానని గ్రహించి ఆస్ట్రేలియా సైబర్ సెక్యూరిటీ విభాగానికి ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో అహ్మదాబాద్‌లోని అతడి తండ్రి తన కుమారుడి ఎఫ్డీ మాయమవ్వడం గమనించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ కుట్ర బయటపడింది. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా పోలీసులు సంయుక్తంగా ఈ అంతర్జాతీయ సైబర్ దాడిపై విచారణ జరుపుతున్నారు.
Follow Us