/rtv/media/media_files/2025/10/24/kaveri-travels-bus-accident-2025-10-24-15-59-20.jpg)
Kaveri Travels Bus accident
Kurnool Bus Accident: అయ్యా.. నా ఒక్కగానొక్క కొడుకు ఇక లేడయ్యా.. మేం ఎవరికోసం బతకాలయ్యా.. అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఈ తండ్రి ఆవేదన గుండెల్ని పిండేస్తోంది. ఈరోజు తెల్లవారుజామున కర్నూల్ వద్ద జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన రమేష్ సహా ఆయన భార్య, ఇద్దరు పిల్లలు సజీవ దహనమయ్యారు. రమేష్ మరణంతో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగింది. వృద్ధాప్యంలో తనకు అండగా ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడని తెలియడంతో రమేష్ తండ్రి మానుకొండయ్య గుండెపగిలేలా రోదిస్తున్నారు. ఒకేసారి కొడుకు, కోడలు, మనవళ్లను కోల్పోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
నా కొడుకు లేడు
ఈ మేరకు రమేష్ తండ్రి మానుకొండయ్య ఆర్టీవీ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన ఒక్కగానొక్క కొడుకు ఇక లేడని ఆవేదన చెందుతున్నారు. మానుకొండయ్య మాట్లాడుతూ.. ఈరోజు తెల్లవారుజామున మాకు విషయం తెలిసింది. నా ఒక్కగానొక్క కొడుకును తీసుకెళ్లి ఆ దేవుడు మాకు అన్యాయం చేశాడు. ఇప్పుడు మేం ఎవరి కోసం బ్రతకాలి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పండగ కోసమని పిల్లలతో కలిసి బెంగళూరు నుంచి ఊరికి వచ్చారు. పిల్లలు 15 రోజులుగా ఇక్కడే ఉన్నారు. కనీసం ఆ పిల్లలు ఉన్నా.. వాళ్ళను చూసుకొని బ్రతికేవాడిని! అని ఆవేదన చెందారు మానుకొండయ్య.
రమేష్ బెంగళూరులో సూపర్ వైజర్ ఉద్యోగం చేస్తూ కొన్నాళ్లుగా ఫ్యామిలీతో అక్కడే ఉంటున్నాడు. అయితే దీపావళి దీపావళి పండగ కోసం సొంతూరు వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. నిరుపేద కుటుంబం అయినప్పటికీ.. మానుకొండయ్య కొడుకు రమేష్ ను కష్టపడి చదివించి ప్రయోజకుడిని చేసినట్లు తెలిపారు. చేతికందిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు ఆ తండ్రి. ఇంట్లో పిల్లలు ఆడుకున్న దృశ్యాలు ఇంకా కళ్ళముందే ఉన్నాయి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. రమేష్ మరణంతో ఆ గ్రామం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read: Kurnool Bus Accident: అయ్యో అనూష.. బస్సు ప్రమాదంలో యాదాద్రి యువతి.. కన్నీటి కథ!
Follow Us