వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోటలో ఒక యువతి దారుణ హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది. మృతురాలిని వైష్ణవిగా గుర్తించారు. ఆమె ప్రొద్దుటూరు పట్టణంలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతోంది. అయితే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైష్ణవి సోమవారం (జూలై 14) కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. అయితే, ఆరోజు సాయంత్రం ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు (జూలై 15) ఉదయం, గండికోట కోట పరిసరాల్లోని పొదల్లో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా, ఆమె ఒక యువకుడు లోకేష్ తో కలిసి బైక్‌పై గండికోటకు వచ్చినట్లు తేలింది. అదే యువకుడు కొంత సమయం తర్వాత ఆమె లేకుండా ఒంటరిగా తిరిగి వెళ్లినట్లు కూడా ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపించింది. పోలీసులు లోకేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లోకేష్ ఆమెను ప్రేమ పేరుతో వేధించాడని, ఇదే కారణంతో ఆమె కుటుంబం గతంలో ఊరు కూడా మారారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు హత్యతో పాటు లైంగిక వేధింపుల కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
సురేంద్ర పదే పదే ఫోన్ చేస్తుండటంతో
గండికోటలో రిసార్ట్‌లో లోకేష్ రూమ్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అప్పటికే గండికోటకు వెళ్లినట్లు బాలిక అన్న సురేంద్రకు సమాచారం అందింది. వెంటనే సురేంద్ర ప్రొద్దుటూరు నుంచి గండికోటకు చేరుకున్నాడు. సురేంద్ర పదే పదే ఫోన్ చేస్తుండటంతో రూమ్ ఖాళీ చేసి లోకేష్ బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక అన్నపైనే పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతను చెప్పిన దానికి సీసీటీవీ ఫుటేజ్ కు ఎక్కడా పొంతన లేకపోవడం పోలీసులకు మరింత అనుమానం కలుగుతోంది. గండికోటకు సురేంద్ర వచ్చినట్లు సీసీ టీవీల్లో దృశ్యాలు నమోదు కాలేదు. దీంతో పోలీసుల అనుమానాలు మరింత బలపడుతున్నాయి. బాలిక శరీరంపై గాయాలను పోలీసులు గుర్తుంచారు.