/rtv/media/media_files/2025/07/15/malakpet-gun-firing-2025-07-15-08-31-33.jpg)
Gun Firing
BIG BREAKING: పట్టపగలు.. చుట్టూ జనం.. మరోపక్క సీసీ కెమెరాలు.. చూస్తుండగానే బంగారు షాపును దోచుకెళ్లారు దొంగలు! మొహానికి ముసుగులు, చేతిలో తుపాకులతో సినిమా లెవెల్లో దోపిడీకి ప్లాన్ చేశారు. షాపు తెరిచిన 5 నిమిషాల్లోనే లోపలి చొరబడి అందినంతా మాయం చేశారు. అడ్డొస్తే తుపాకులతో బెదిరించి, కాల్పులు జరిపి దోపిడికి తెగబడ్డారు! హైదరాబాద్‌లోని చందానగర్, జ్యోతి స్కూల్ సమీపంలో ఉన్న ఖజానా జ్యువెల్లర్స్ షాపులో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఖజానా జ్యువెల్లర్స్ లో చోరీ
వివరాల్లోకి వెళితే.. ఎప్పటిలాగే ఈరోజు కూడా షాపు ఓపెన్ చేసి ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సరిగ్గా 12.30 నిమిషాల ప్రాంతంలో గుర్తుతెలియని ఆరుగురు దుండగలు తుపాకులతో షాపులోకి చొరబడ్డారు. సిబ్బందిని తుపాకులతో భయపెట్టి దోపిడీకి పాల్పడ్డారు. అయినప్పటికీ డిప్యూటీ మేనేజర్ అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. గాల్లో రెండు రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మేనేజర్ కాలికి బులెట్ తగిలినట్లు తెలుస్తోంది.
షాపు తెరిచిన 5 నిమిషాల్లోనే అందినంత దోచుకొని అక్కడి నుంచి పరారయ్యారు. షాపులోని సీసీ కెమెరాలకు కూడా చిక్కకుండా వాటిని గన్ తో పేల్చేశారు. దీంతో షాపు యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించగా.. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన డిప్యూటీ మేనేజర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆ దుండగుల ముఠా ఎవరు? ఏంటి అనే విషయంపై ఆరా తీస్తున్నారు. అయితే ఈ దోపిడీ వెనుక ఎవరున్నారు, ఎంత విలువైన ఆభరణాలు దోచుకెళ్లారన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన చందానగర్ ప్రాంతంలో కలకలం రేపింది. పగటిపూట ఇలాంటి హైటెక్ దొంగతనం జరగడం స్థానికులను, నగరవాసులను కలవర పెడుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ దొంగల ముఠా జహీరాబాద్ వైపు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో జిల్లాల సరిహద్దులను, టోల్ గేట్స్ ని అలెర్ట్ చేశారు. మొత్తం 10 ప్రత్యేక బృందాలు గా ఏర్పడి దుండగుల కోసం గాలిస్తున్నారు. కౌంటర్ లోని డబ్బులు, విలువైన బంగారు నగలను దోపిడీకి గురైనట్లు తెలుస్తోంది.
ఇది మాత్రమే కాదు, గతంలో కూడా ఇలాంటి హైటెక్ దొంగతనాలు పలు చోట్ల వెలుగు చూశాయి. వీటికి సంబంధించిన ఇక్కడ తెలుసుకుందాం..
సికింద్రాబాద్, సూర్యాపేట
కొంతకాలం క్రితం, సికింద్రాబాద్ పాట్ మార్కెట్‌లోని ఒక జ్యువెల్లరీ షాపులో సూర్య గ్యాంగ్ సినిమా లెవెల్లో దోపిడి చేశారు దుండగులు. ఐటీ అధికారులమని నమ్మించి నకిలీ ఐడీ కార్డులతో షాపులోకి చొరబడ్డారు. తనిఖీలు చేస్తున్నట్లుగా నటిస్తూ.. భారీగా నగదు, బంగారాన్ని దోపిడీ చేశారు. ఇదిలా ఉంటే ఇటీవలే సూర్య పేటలో ఊహించని రీతిలో దొంగతనానికి స్కెచ్చేశారు. గ్యాస్ కట్టర్ తో జ్యువెల్లరీ షాపు వెనుక గోడను కోసి దోపిడీకి తెగబడ్డారు. దాదాపు 18 కిలోల బంగారాన్ని దోచుకెళ్లినట్లు సమాచారం. ఇది తెలంగాణలో జరిగిన అతి పెద్ద బంగారు దోపిడీలో ఒకటి! ఇలాంటి సంఘటనల తర్వాత జ్యూవెలరీ షాపుల్లో భద్రతను మరింత పెంచాలని పోలీసులు సూచించారు.
Also Read: రజనీకేనా విషెస్.. ఎన్టీఆర్‌కు లేవా.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!