/rtv/media/media_files/2025/08/06/gujrat-surat-woman-arrested-during-fake-marriage-2025-08-06-10-13-49.jpg)
gujrat surat woman arrested during fake marriage
గుజరాత్‌లోని సూరత్‌లో దారుణం జరిగింది. నాగ్‌పూర్‌కు చెందిన ఓ మహిళ.. నగల వ్యాపారిని రూ.2.10 లక్షలకు పెళ్లి చేసుకుంది. 10 రోజుల తర్వాత తన అమ్మమ్మ చనిపోయిందని చెప్పి ఇంట్లో ఉన్న రూ.40 వేల విలువైన నగలతో చెక్కేసింది. ఈ క్రమంలో ఆమె తిరిగి వస్తుందనుకున్న ఆ భర్తకు బిగ్ షాక్ తగిలింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన భార్య అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. బయటవారికి తెలిస్తే తన పరువు పోతుందని.. తనలో తానే కుమిలిపోయి చివరికి గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఫేక్ పెళ్లి వెనుక ఉన్న వారిని గుర్తించి అరెస్టు చేశారు. అందులో ఫేక్ వధువు కూడా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Gujrat Fake Marriage
భావ్‌నగర్‌కు చెందిన 38 ఏళ్ల నగల వ్యాపారి సూరత్‌లోని వరాచా ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతడు 15 సంవత్సరాల క్రితం మరాఠీ అమ్మాయి నిషాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె ఉంది. అయితే ఆ అమ్మాయికి 5 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు.. ఆమె తల్లి నిషా వేరొకరితో పారిపోయింది. ఇప్పటికీ ఆమె ఎక్కడ ఉందో తెలియకపోవడంతో.. ఆ నగల వ్యాపారి కీలక నిర్ణయం తీసుకున్నాడు.
తన కూతురు తల్లి ప్రేమను పొందేలా రెండో వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. దీంతో అమ్మాయిని వెతకడం ప్రారంభించాడు. కానీ ఒక్కరు కూడా అతడి కంట పడలేదు. అదే సమయంలో ఆ నగల వ్యాపారి మామ రమేష్ ఫుర్జీభాయ్ వడోదరియా అతడిని సంప్రదించాడు. జరిగిన విషయం తెలుసుకుని ఆ నగల వ్యాపారిని వడోదరలోని సీమాబెన్ అనే మహిళ ఇంటికి తీసుకెళ్లాడు.
అక్కడ సీమాబెన్ కూతురు దుల్హాన్ ముస్కాన్ ఫొటోను చూపించాడు. దీంతో నగల వ్యాపారి ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ దుల్హాన్ ముస్కాన్‌కు ఎవరూ లేరని.. సీమాబెన్ ఆమెను పెంచిందని.. అందువల్ల ఆమెకు రూ.2.21 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని రమేష్ చెప్పాడు. దీంతో నగల వ్యాపారి తండ్రి రూ.2.10 లక్షలు ఇచ్చి డిసెంబర్ 9, 2024న వడోదరలో వివాహ ఒప్పందం రాసుకున్నాడు.
మొత్తంగా నగల వ్యాపారికి దుల్హాన్ ముస్కాన్‌కు పెళ్లి జరిగింది. అనంతరం పది రోజుల వరకు బాగానే ఉన్నారు. కానీ ఒక రోజు సీమాబెన్ ఆ నగల వ్యాపారికి ఫోన్ చేసింది. తన కూతురు దుల్హాన్ ముస్కాన్‌ను ఒకరోజు ఇంటికి పంపించాలని కోరగా.. అతడు వడోదరకు పంపించాడు. ఆ మరుసటి రోజు సీమాబెన్ మరోసారి నగల వ్యాపారికి ఫోన్ చేసింది. దుల్హాన్ ముస్కాన్ అమ్మమ్మ చనిపోయిందని.. ఆమె అన్ని పనులు పూర్తి చేసి ఐదు-ఆరు రోజుల్లో తిరిగి వస్తుందని చెప్పింది.
అలా రెండు మూడు రోజులు గడిచిన తర్వాత ఆ నగల వ్యాపారికి బిగ్ షాక్ తగిలింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన భార్య దుల్హాన్ ముస్కాన్‌కు సంబంధించిన అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలు చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. దీంతో వాటిని చూసి సమాజం ఏం అనుకుంటుందో?.. తన పరువు ఎక్కడ పోతుందోనని తీవ్ర మనస్తాపం చెంది గుండెపోటుతో మరణించాడు. అనంతరం అంత్యక్రియల తర్వాత.. నగల వ్యాపారి గదిలో రుద్రాక్ష జపమాల సహా రూ.40,000 విలువైన నగలు కనిపించకుండా పోయాయని తేలింది.
దీంతో మృతుడి అన్నయ్య ఫిబ్రవరి 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి మామ రమేష్, మరొక వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ తర్వాత జూన్ 7న మృతుడి భార్య దుల్హాన్ ముస్కాన్ తల్లి సీమాబెన్‌ను వడోదరలో అరెస్టు చేశారు. గత ఏడు నెలలుగా పరారీలో ఉన్న ముస్కాన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి ఒక రోజు రిమాండ్‌కు తరలించారు.