/rtv/media/media_files/2026/01/30/cj-roy-2026-01-30-21-32-20.jpg)
సౌత్ ఇండియాలో ప్రముఖ బిజినెస్‌మ్యాన్, కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ సీజే రాయ్ ఆత్మహత్య కలకలం రేపింది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా వేల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన రాయ్ ఆఫీస్‌లోనే రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం పారిశ్రామిక వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఈ దారుణానికి ప్రధాన కారణం గత కొన్ని రోజులుగా ఆయన సంస్థలపై జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ దాడులేనని ప్రాథమిక సమాచారం. కేరళ, బెంగళూరులోని కాన్ఫిడెంట్ గ్రూప్ కార్యాలయాలు, ప్రాజెక్టులపై ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సోదాలు జరుగుతున్న సమయంలోనే ఆయన తీవ్ర ఒత్తిడికి, మనస్తాపానికి లోనైనట్లు తెలుస్తోంది. తన గౌరవానికి భంగం వాటిల్లిందని భావించిన రాయ్, అధికారులు తన కార్యాలయంలో ఉండగానే లోపలి గదిలోకి వెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వందల కోట్ల ఆస్తులు, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార సంబంధాలు ఉన్న వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న లోతైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సీజే రాయ్ కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా, కళలు, క్రీడల పట్ల ఉన్న మక్కువతో అందరికీ సుపరిచితులు. మలయాళ చిత్ర పరిశ్రమతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన 'కాసనోవా' వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించడమే కాకుండా, అనేక చిత్రాలకు వెన్నుదన్నుగా నిలిచారు. కేరళలో సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొనేవారు. దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరాల్లో సైతం కాన్ఫిడెంట్ గ్రూప్ పెద్ద ఎత్తున ప్రాజెక్టులను చేపట్టింది. ఆయన మృతితో కేరళ వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం బెంగళూరు పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. ఆయన ఆత్మహత్యకు ముందు ఏవైనా లేఖలు రాశారా? లేదా ఐటీ దాడుల్లో ఏవైనా కీలక పత్రాలు దొరకడం వల్ల ఆయన భయాందోళనకు గురయ్యారా? అనే కోణంలో విచారణ సాగుతోంది. ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ మాగ్నెట్ ఇలా బలవన్మరణానికి పాల్పడటం, వ్యవస్థల్లో ఉన్న ఒత్తిడిని అకస్మాత్తుగా ఎదురయ్యే సంక్షోభాలను ఎలా తట్టుకోవాలో తెలియని స్థితిని సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Follow Us