/rtv/media/media_files/2025/10/15/doctor-2025-10-15-17-33-31.jpg)
తన భార్యకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసి, అది సహజ మరణమని ఆమె కుటుంబ సభ్యులను నమ్మించిన బెంగళూరుకు చెందిన డాక్టర్ మహేంద్ర రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే తన కుమార్తె మరణం సహజ మరణం కాదని, హత్య అని తెలుసుకున్న డాక్టర్ కృతికా రెడ్డి తండ్రి కుప్పకూలిపోయాడు. కృతికా రెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఉండటం వల్లే తన భార్యను మహేంద్ర హత్య చేశాడని దర్యాప్తులో వెల్లడైంది.
ఈ క్రమంలో కృతికా రెడ్డి తండ్రి మునిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మారతహళ్లిలోని తన కుమార్తె ఇంటిని ఇస్కాన్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆమె జ్ఞాపకాలు ఈ ఇంట్లో ఆమెను చాలా వెంటాడుతున్నాయి. అందుకే ఈ ఇంటిని ఇస్కాన్ ఆలయానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. తమ పెద్ద కుమార్తె అనుమతితోనే ఈ నిర్ణయం తీసుకున్నాముని వెల్లడించాడు. కృతికాను హత్య చేసిన మహేంద్రను శిక్షించాలని, ఇలాంటి సంఘటన ఏ స్త్రీకీ జరగకూడదని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.
కృతికాకు ఇంట్రావీనస్ ఇంజెక్షన్
2024 మే 26న కృతికా, మహేంద్ర రెడ్డిలకు వివాహం జరిగింది. అయితే కృతికాకు షుగర్ వంటి అనారోగ్య సమస్యలున్నాయి. ఈ క్రమంలో 2025 ఏప్రిల్ 23న తండ్రి నివాసంలో కుప్పకూలిపోయింది కృతికా. ఆ సమయంలో కృతికాకు ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ఇచ్చాడు మహేంద్ర. చికిత్స కోసమే ఆ ఇంజెక్షన్ ఇచ్చినట్లు ఆమె తల్లిదండ్రులకు తెలిపాడు. ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే కృతికా చనిపోయింది. అయితే కృతికా అక్క రేడియాలజిస్ట్ అయిన డాక్టర్ నికితా రెడ్డికి అనుమానం రావడంతో ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఆరు నెలల తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) రిపోర్టులో కృతికా బాడీలో ప్రొపోఫోల్ అనే మత్తుమందు ఉన్నట్లుగా తేలింది. కృతిక మత్తుమందు సమ్మేళనం కారణంగా మరణించిందని నిర్ధారించింది. భార్యను హత్య చేశాక మణిపాల్‌కు పరారైన నిందితుడు మహేంద్రను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అతనిపై ఇప్పటికే లుక్-అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేయబడింది. హత్యను అమలు చేయడానికి మహేంద్ర తన వృత్తిపరమైన OT, ICU మందులను ఉపయోగించుకున్నాడని, తరువాత దానిని సహజ మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.