CPI K Ramakrishna: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను అబద్దాలు చెప్పింది కాక ఇప్పుడు గవర్నర్ చేత కూడా అబద్దాలు చెప్పిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో సోమవారం నాడు గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగంపై రామకృష్ణ స్పందించారు. గవర్నర్ ప్రసంగ పాఠం ఒక అబద్దాల పుట్టన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యాసంస్కరణలు చేపట్టామని చెప్పడం బోగస్ అని వ్యాఖ్యనించారు.
రామకృష్ణ స్పందించిన ముఖ్య విషయాలు
' దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుండి తరలిపోయారంటే విద్యారంగం ఏ మేరకు కుంటుపడిందో అర్థం చేసుకోవచ్చు. పైగా కేసుల్లో కూరుకుపోయిన వివాదాస్పదమైన బైజూస్ కంపెనీకి వందల కోట్ల ప్రభుత్వ నిధులు దోచి పెట్టారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం బకాయిలు చెల్లించటం లేదు కాబట్టే ప్రైవేటు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీని అనుమతించడం లేదు. ఇరిగేషన్ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. గండికోట ప్రాజెక్టులో 27 టీఎంసీల నీటిని నిల్వ చేసినప్పటికీ ఒక్క ఎకరా ఆయకట్టుకు నీరు ఇచ్చిన పాపాన పోలేదు. ప్రాజెక్టు కింద కాలువలు తవ్వలేదు. సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడం వల్ల అన్నమయ్య, ఫించా ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి. ఉచిత విద్యుత్కు మంగళం పాడేందుకు సిద్ధమయ్యారు. గత నాలుగున్నర ఏళ్లలో దాదాపు రూ.57 వేల కోట్ల విద్యుత్ భారాలను ప్రజలపై మోపారు. విశాఖలో జరిగిన సమ్మిట్ లో రూ.13 లక్షల 11 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని గవర్నర్ చెబుతున్నారు. అసలు ఆ పెట్టుబడులు ఎక్కడ వచ్చాయని, ఏఏ పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయని ప్రశ్నిస్తున్నాం. గ్లోబల్ ఎడ్యుకేషన్ పేరుతో విద్యార్థులను గందరగోళంలోకి నెట్టారు.
తెలంగాణను చూసైనా నేర్చుకోవాలి..
నాడు`నేడుతో స్కూల్స్ రూపురేఖలు మార్చినా, అవి బల్లలు, సున్నాలకే పరిమితమైంది. ఉపాధ్యాయులు ఉంటే కదా పాఠశాలలకు నిండుదనం. 25 వేల ఉపాధ్యాయ పోస్టుల ఖాళీతో స్కూల్స్ వెలవెలబోతున్న వాస్తవాన్ని ఎందుకు చెప్పలేదు. పైగా మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు కేవలం 4000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను దగా చేశారు.అమ్మఒడి, విద్యాకానుక పథకాల్లో కోతలు నేటికీ విద్యార్థుల తల్లులను వేధిస్తున్న సమస్య. పైగా కొన్ని విడతలను ఎగ్గొట్టి మోసం చేసిన ఘనత జగన్‌దే. 1వ తరగతి నుంచే ఐటీ విధానమంటూ సరికొత్త మోసానికి తెరతీస్తున్నారు. సిబ్బంది లేకుండా, నియామకాలు లేకుండా, ఎక్విప్‌మెంట్ లేకుండా డిజిటల్ విధానం ఎలా వస్తుందో అర్థం కావడం లేదు. కొత్త ఆసుపత్రులు, సౌకర్యాల మెరుగుదల ఒక ఫార్సు. ఇంటి వద్దనే వైద్యసేవలు తూతూమంత్రంగా ముగించేశారు. ఆరోగ్యశ్రీకి ఆసుపత్రుల్లో అనుమతే లేదు. బకాయిల కారణంగా కార్పొరేట్ ఆసుపత్రులు ఏనాడో ఆరోగ్యశ్రీకి చేతులెత్తేసాయి. కనీసం తెలంగాణను చూసైనా నేర్చుకోవాలి. 62 శాతం మంది వ్యవసాయంమీదనే ఆధారపడినా, వారి కోసం తీసుకున్న సంక్షేమ చర్యలు పెద్దగా లేవు. కేంద్రపథకాలకే నాలుగు పైసలు చేర్చి మొత్తం నిధులు తమవేనని సీఎం చెప్పుకుంటున్నారు. రైతుభరోసాలో కేంద్ర నిధులను తీసేసి అసలు లెక్కలు చెప్పాలి. పంటల బీమా క్లెయిమ్‌ల్లో జాప్యంపై సమాధానం చెప్పాలి. ఏపీలో రైతు కూలీలు దగాపడినట్లుగా ఏ రాష్ట్రంలోనూ లేదు. వారి కోసం ఒక్క పథకమూ లేదు. దీంతో ఏపీలో గ్రామీణ నిరుద్యోగం విపరీతంగా పెరిగింది.
Also Read: విశాఖలో దారుణం.. పెళ్లి చేసుకోమన్న ప్రియురాలిని ప్రియుడు ఏం చేశాడంటే ?
ఇంకెన్ని దశాబ్దాలు నిరీక్షించాలి?
ఆక్వాహబ్ పేరుతో కార్పొరేట్లకు తాయిలాలు ఇస్తున్నారు. మహిళా సాధికారత పేపరుకే పరిమితమైంది. అంగన్‌వాడీలు, ఆశాకార్యకర్తలను మోసం చేశారు. మహిళల పట్ల క్రైమ్ రేటు పెరిగింది. వైసీపీ నేతల దురాగతాలు పెరిగాయి. తప్పుడు కేసులు పెట్టి అమాయకులను జైలుపాలు చేస్తున్నారు. పోలీసులు వైసీపీ నేతలకు చెంచాలుగా మారారు. రాజకీయ కక్షసాధింపులు పెరిగాయి. 3,57,844 మంది అర్హుల ఖాతాల్లో రూ.2,029 కోట్లు జమ చేశామని చెపుతున్నారు. ఈ లెక్క సరిచూసుకోవాలి. ఇంకెన్నాళ్లు ప్రజలను దగాచేస్తారు? చెల్లింపులకు ఇంకా సమయం ఉన్నా, డబ్బులు కట్టాల్సిందిగా డ్వాక్రా మహిళలపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. నవరత్నాలు చేరాల్సిన వారికి ఇంకా చేరడం లేదు. పథకాల వర్తింపులో గ్రామ సచివాలయాలు కేంద్రాలుగా రాజకీయాలు పెరిగిపోయాయి. కేంద్రం ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేకపోయారు. కేంద్రానికి తొత్తుగా వ్యవహరించి, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలు, ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక సాయంపై ఊసేదీ? కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదు? పోలవరం ప్రాజెక్టు పూర్తికావడానికి ఇంకెన్ని దశాబ్దాలు నిరీక్షించాలి? ఇంకెన్నో కీలక ప్రాజెక్టులు ఐదేళ్లుగా పెండిరగ్‌లోనే ఉన్నాయి. నాణ్యమైన విద్యుత్ సరఫరా దొంగమాటే. విద్యుత్ మీటర్లు పెట్టి రైతులను దెబ్బతీస్తున్నారు. కరెంటు కోతలేమైనా తగ్గాయా? పైగా కనిపించన ఛార్జీలతో కరెంటు వాత పెట్టడంలో జగన్ ముందున్నారు.
ఐటీ రంగం ఏనాడో జీరో
రహదారులను అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పడం పచ్చి అబద్దం. రాష్ట్రంలో రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో ఏ ఒక్కరిని అడిగినా చెపుతారు. పేదలకు ఇళ్ల నిర్మాణం ఇంకా కలగానే మిగిలింది. జగనన్న ఇళ్లు పెద్ద మోసం. కనీసం టిడ్కో ఇళ్లను పూర్తిచేసినా జగన్‌కు పరువు దక్కేదేమో. నాలుగున్నరేళ్లుగా ఎయిర్‌పోర్టులపై చెప్పిందే చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. అమరావతి గురించి ప్రస్తావించకపోయినా, కనీసం తాను అనుకున్న మూడు రాజధానుల గురించి కూడా గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించకపోవడం రాజధాని వ్యవహారంపై జగన్ దగాకోరు వైఖరిని నిదర్శనం. పారిశ్రామిక ప్రగతి కనీవినీ ఎరుగని స్థాయిలో అట్టడుగుకి చేరింది. ఒక్క కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టడానికి ఏపీకి రావడం లేదు. వైసీపీ నేతల వేధింపుల కారణంగా ఉన్న కంపెనీలు కూడా హైదరాబాద్‌కు తరలిపోతున్నాయి. ఐటీ రంగం ఏనాడో జీరో అయింది. రాష్ట్రంలో పర్యాటకులు పెరిగినా, పర్యాటక స్థలాల్లో సౌకర్యాలు లేక సందర్శకులు ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ రంగంలో పెట్టిన పెట్టుబడులు మొత్తం మంత్రి, సంబంధిత అధికారులు స్వాహా చేసిన అంశం వాస్తవం కాదా? ఈ రంగంలో 7,290 మందికి ఉపాధి కల్పించేలా రూ.3,685 కోట్ల పెట్టుబడి పెట్టామని చెప్పడం ఇంకో తప్పుడు లెక్క. భూ హక్కుల చట్టం పేరుతో ప్రజలను మోసం చేయడం దారుణం. ఇవన్నీ వదిలేసి, గవర్నర్ నోటితో అబద్దాలు చెప్పించడం అన్యాయం. ఇది ఎన్నికల ముందు ప్రజలకు వెన్నుపోటు పొడవడమే' అంటూ వైసీపీ ప్రభుత్వంపై పలు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.