CPI Ramakrishna: ఏపీలో 18 జిల్లాల్లో తీవ్రమైన కరవు నెలకొందని సిపిఐ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివిధ జిల్లాల్లో మా ప్రతినిధులు పర్యటించారని అయితే, రాష్ట్ర విభజన తర్వాతే అన్నదాతలు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు వేయలేని దుస్థితి లో రైతన్నలు ఉన్నారన్నారు. దాదాపు 440 మండలాల్లో దుర్భరమైన పరిస్థితి ఉందని తెలిపారు. చివరికి ఆయకట్టు ప్రాంతంలో కూడా పంటలు లేవని వెల్లడించారు. నీటి ప్రాజెక్టుల్లో నీరు లేక ..కనీసం ఎకరాకు నీరు అందని పరిస్థితి ఉందని వాపోతున్నారు.
Also Read: పాలిటిక్స్, కబడ్డి.. సేమ్ టూ సేమ్..మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..!
అయితే, సీఎం జగన్ మాత్రం అసలు కరవుపై ఏ మాత్రం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో కరవు పై సమీక్ష కూడా చేయడం లేదని దుయ్యబట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ దాక్కున్నాడో తెలియడం లేదని ఫైర్ అయ్యారు. వివిధ కార్యక్రమాల్లో తిరిగే మంత్రులు.. కరవు ప్రాంతాల్లో ఎందుకు పర్యటించరని ప్రశ్నించారు. కరువుతో ఇబ్బంది పడుతున్న అన్నదాతల పరిస్థితులపై ఎవరూ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
Also Read: ఓటమి భయంతోనే దాడులకి తెగబడ్డారు: లోకేష్
వైసీపీ మంత్రులు, అధికారులు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో బిజీగా ఉన్నారే తప్ప.. పంట నష్టంపై పట్టించుకునే నాధుడే లేడని అన్నారు. అన్నదాతల సమస్యలు పట్టించుకోని నీలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా అంటూ జగన్ పై విమర్శలు గుప్పించారు. క్యాబినెట్ లో కూడా కరవు పై చర్చ చేయకపోవడం దుర్మార్గం కాదా అంటూ ఫైర్ అయ్యారు.
రాయలసీమ నుంచి వలసలు పోతున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రానికి ఎంతమాత్రం అవసరం లేదని అన్నారు. ప్రజలను, రైతులను పట్టించుకోని జగన్ వద్దని ప్రజలు డిసైడ్ అయ్యారని వ్యాఖ్యనించారు. కృష్ణా జలాల విషయంలో ప్రధాని ఏపీకి అన్యాయం చేశారని విమర్శించారు. తెలంగాణ ఎన్నికలలో లబ్ది కోసమే ఈ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. జగన్ మాట్లాడలేని దద్దమ్మ కాబట్టే ఏపీకి పదే పదే అన్యాయం జరుగుతుందని విమర్శనాస్త్రాలు సంధించారు. కాగా, ఈ నెల 20, 21 తేదీలలో కరువు అంశంపై 30 గంటల పాటు నిరసన కార్యక్రమం విజయవాడలో చేపడతామని సిపిఐ రామకృష్ణ తెలిపారు.