Bangalore : బెంగళూరు రేవ్ పార్టీ కేసు (Rave Party Case) లో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు బెంగళూరు సీపీ దయానంద ప్రెస్‌మీట్ లో తెలిపారు. ఈ రేవ్ పార్టీకి వాసు, అరుణ్, సిద్దిఖీ, రణధీర్, రాజ్ అనే ఐదుగురే డ్రగ్స్ తీసుకుని వచ్చినట్లు సీపీ తెలిపారు. ఈ రేవ్ పార్టీలో ఇద్దరు సినీ నటులు (Cine Actors) కూడా దొరికినట్లు సీపీ వివరించారు.
పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే అనుమానం ఉన్న వారి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పార్టీకి హాజరవైన 100 మంది నుంచి సెల్ ఫోన్లను కూడా సీజ్ చేసినట్లు సీపీ మీడియాకి తెలిపారు. ఈ డ్రగ్స్ కేసులో ప్రజా ప్రతినిధులు ఎవరూ లేరని ఆయన వివరించారు.
అసలేం జరిగిందంటే.. బెంగళూరు నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న రేవ్ పార్టీపై సీసీబీ బృందం దాడి చేసింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు సీసీబీ పోలీసులు (CCB Police) దాడులు చేయగా.. దాడిలో పార్టీలో డ్రగ్స్ దొరికాయి. ఇక ఈ పార్టీలో కొందరు తెలుగు నటీమణులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాన్ కార్డ్ యజమాని గోపాల్ రెడ్డికి చెందిన జీఆర్ ఫామ్‌హౌస్‌లో హైదరాబాద్ (Hyderabad) కు చెందిన వాసు పార్టీ ఏర్పాటు చేశారు. వాసు బర్త్ డే పార్టీ పేరుతో సాగుతున్న ఈ పార్టీ అర్ధరాత్రి 2 గంటల వరకు ముగియలేదు. సమయానికి మించి పార్టీలు చేసుకున్నారు. దీంతో సీసీబీ యాంటీ నార్కోటిక్స్ విభాగం అధికారులు అక్కడ దాడులు నిర్వహించారు.
ఈ దాడిలో 17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, కొకైన్ లభ్యమయ్యాయి. ఆంధ్రా, బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా యువతీ యువకులు, 25 మందికి పైగా సినీ తారలు పార్టీలో పాల్గొన్నట్టు చెబుతున్నారు. ఆర్గనైజింగ్ పార్టీ కోసం ఆంధ్రా నుంచి విమానంలో వీరంతా వచ్చినట్టు చెబుతున్నారు.
అక్కడ ఒక బెంజ్ కారులో ఆంధ్రా ఎమ్మెల్యే పాస్‌పోర్ట్ దొరికింది. ఈ పాస్ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరు మీద ఉంది. అంతేకాకుండా, దాడి జరిగిన ఫామ్‌హౌస్ సమీపంలో మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్, ఆడి కార్లు సహా 15కు పైగా లగ్జరీ కార్లు లభ్యమయ్యాయి. ఈ పార్టీలో మోడల్స్, టెక్కీలు కూడా పాల్గొనగా, తెలుగు నటీమణులు కూడా ఉన్నారని అందులో తెలుగు నటి హేమ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Also read: హైదరాబాద్ లో 6 చోట్ల ఏసీబీ రైడ్స్.. ఆ కీలక పోలీస్ అధికారే టార్గెట్?