Costlier Tomato Upto Rs.100/- Per Kg : మొన్నటి వరకు విపరీతమైన ఎండల వల్ల కూరగాయల ధరలు (Vegetable Prices) ఆకాశానంటాయి. ఈ క్రమంలోనే ప్రతి కూరలోనూ కచ్చితంగా కనిపించే టమాటా ధర అందనంత దూరంలో ఉంటుంది. సకాలంలో వర్షాలు కురవక పోవడం వల్ల టమాటా తోటల నుంచి దిగుబడి తగ్గడంతో టమాటాలకు విపరీతమైన గిరాకీ పెరిగింది.
దీంతో ఇప్పటికే ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR), ముంబై మెట్రో నగరాలతోపాటు పలు నగరాలు, పట్టణాల్లో కిలో టమాటా ధర (Tomato Price) సుమారు రూ.90 పలుకుతోంది. ఒకవైపు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు అకస్మాత్తుగా టమాటా ధరలు పెరిగి పోవడంతో ఆహార వస్తువుల విభాగంలో అనిశ్చితి ఏర్పడింది. హీట్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో టమాటాలు కొనుగోలు చేసే వారి జేబులకు చిల్లు పడుతోంది.
టమాటాల దిగుబడి తగ్గడంతోపాటు సరఫరా వ్యవస్థలో ప్రతికూల ప్రభావం పడుతున్నదని చెబుతున్నారు. టమాటా ఎక్కువగా పండించే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల రబీ సీజన్ పంట దిగుబడి తగ్గిపోయింది.. ఫలితంగా మార్కె్ట్లోకి వస్తున్న టమాటాలు 35 శాతం తగ్గాయని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ పేర్కొంది.
మరోవైపు ఈశాన్య రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో రోడ్లు దెబ్బ తిన్నాయి. తత్ఫలితంగా ప్రధాన కేంద్రాలకు టమాటాల సరఫరా తగ్గిందని చెబుతున్నారు. దీంతో టమాటాల ధర పెరిగిందని నిపుణులు అంటున్నారు. నెల క్రితం కిలో టమాటాలు రూ.35 పలకగా.. ఈ నెల ఏడో తేదీన 70 శాతానికి పైగా వృద్ధి చెంది రిటైల్ మార్కెట్లో రూ.59.87 గా ఉన్నాయి. అమెజాన్ ఫ్రెష్, స్విగ్గీ, జెప్టో వంటి ప్రముఖ డిజిటల్ సర్వీసెస్ సంస్థల్లో కిలో టమాటాలు రూ.80 నుంచి రూ. 90 గా ఉన్నాయి.