COP28 Summit: మనం మన హెల్త్ కార్డ్ గురించి ఎలా ఆలోచిస్తామో, అదే విధంగా పర్యావరణం గురించి కూడా ఆలోచించాలి. ఆరోగ్య కార్డుకు జోడించినట్టే.. భూమి కోసం కూడా పాజిటివ్ పాయింట్స్ జోడించే విధంగా చేయాలి. ఇది భూమికి మనం ఇచ్చే గ్రీన్ క్రెడిట్ గా ఉండాలి అంటూ ప్రధాని మోదీ ప్రపంచదేశాలకు పిలుపు ఇచ్చారు. దుబాయ్‌లో శుక్రవారం జరిగిన COP28 వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయం సెషన్‌లో మోదీ సంపన్న దేశాలను టార్గెట్ చేశారు. శతాబ్దాల క్రితం కొన్ని దేశాలు చేసిన చర్యలకు ప్రపంచం మొత్తం మూల్యం చెల్లిస్తోందని ఎవరి పేరు చెప్పకుండానే ఆయన అన్నారు. అధిక కర్బన ఉద్గారాలకు బాధ్యత వహించే దేశాలు వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి నిస్వార్థంగా అభివృద్ధి చెందుతున్న - పేద దేశాలకు సాంకేతికతను బదిలీ చేయాలి అని చెప్పారు. అంతేకాకుండా, 2028 క్లైమేట్ సమ్మిట్ అంటే COP33ని భారతదేశంలో నిర్వహించాలనే ఉద్దేశాన్ని కూడా ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.
ప్రధాని ఇంకా మాట్లాడుతూ.. జీవావరణ శాస్త్రం - ఆర్థిక వ్యవస్థను సమతుల్యం చేయడంలో భారతదేశం ప్రపంచానికి ఒక ఉదాహరణను అందించిందని అన్నారు. ప్రపంచంలో 17 శాతం జనాభా కలిగి ఉన్నప్పటికీ, కర్బన ఉద్గారాలలో భారత్ వాటా 4 శాతం మాత్రమే అని చెప్పారు. ‘’2030 నాటికి కర్బన ఉద్గారాలను 45 శాతం తగ్గించాలన్నది మా లక్ష్యం. భారతదేశం గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్‌ను ఏర్పాటు చేసింది అని ఆయన వివరించారు. అలాగే క్లైమేట్ ఫైనాన్స్ ఫండ్‌ను మిలియన్ నుంచి ట్రిలియన్ డాలర్లకు పెంచాలి అని ఆయన ప్రపంచ దేశాలను కోరారు.
క్లైమేట్ సమ్మిట్‌లో(COP28 Summit) పాల్గొనేందుకు ప్రధాని నవంబర్ 30 రాత్రి దుబాయ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా హోటల్ వెలుపల భారత సంతతికి చెందిన ప్రజలు ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఓ డ్యాన్స్ గ్రూప్ నృత్య ప్రదర్శన కూడా ఇచ్చింది. ప్రధాని కాసేపు నిలబడి నృత్యాన్ని వీక్షించారు. ఆ కళాకారులను ప్రశంసించారు. దీంతో పాటు యువత, మహిళలతోనూ మోదీ సమావేశమయ్యారు.
లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అంటే..
COP28 Summit: భూమి ఉష్ణోగ్రత నిరంతరం పెరుగుతోంది. దీంతో కొన్ని చోట్ల వరదలు, కొన్నిచోట్ల అనావృష్టి నెలకొంది. అయినప్పటికీ, వాతావరణ మార్పు పరిణామాలు అన్ని దేశాలకు ఒకే విధంగా లేవు.
2022లో పాకిస్థాన్‌లో ప్రమాదకరమైన వరద వచ్చింది. దీని ప్రభావం 33 లక్షల మందిపై ఉంది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌కు 30 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. అదే సమయంలో, వాంటౌ అనే ద్వీప దేశం సముద్ర మట్టం పెరగడం వల్ల దాని 6 నగరాలను మార్చవలసి వచ్చింది.
Also Read: ఒప్పందం ముగిసింది..మళ్ళీ కాల్పులు మొదలయ్యాయి
దీని కారణంగా, వాతావరణ మార్పుల వల్ల కలిగే విషాదాల నుంచి తమ ప్రజలను రక్షించడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలు నిరంతరం నిధులను డిమాండ్ చేస్తున్నాయి. భారతదేశం - చైనా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు సంపన్న దేశాలు ఈ పర్యావరణ విధ్వంస పర్యవసానాలకు బాధ్యత తీసుకోవాలని నమ్ముతున్నాయి. ఎందుకంటే ఆ దేశాల కర్బన ఉద్గారాల వల్లనే భూమి ఉష్ణోగ్రత పెరిగింది.
1975 నుండి 2021 వరకు, అమెరికా మాత్రమే 25% కార్బన్ ఉద్గారాలను కలిగి ఉంది. భారత్ 3.4 శాతం కార్బన్‌ను మాత్రమే విడుదల చేస్తోంది. దీని కారణంగా ఇప్పుడు అమెరికా, బ్రిటన్, జర్మనీ సహా పలు దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు వార్షిక పరిహారంగా కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
కార్బన్ ఉద్గారాలను తగ్గించడం ఎజెండాగా..
COP28 వాతావరణ శిఖరాగ్ర సమావేశం(COP28 Summit) డిసెంబర్ 12 వరకు కొనసాగుతుంది. ఇందులో, ప్రధాని మోదీతో పాటు, కింగ్ చార్లెస్, రిషి సునక్, కమలా హారిస్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 167 మంది నాయకులు వాతావరణ మార్పుల సమస్య - దాని పరిష్కారాలపై చర్చిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా, వాతావరణ మార్పు మొత్తం ప్రపంచానికి అతిపెద్ద సవాలుగా మారింది. శిలాజ ఇంధనాలు మరియు కర్బన ఉద్గారాలను అరికట్టడం ఈ సమావేశం ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నారు.
Watch this Interesting Video: