NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపడుతున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నీట్ లీకేజీకి బాధ్యులైన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే లీకేజీ జరిగిందని.. ఒకే పరీక్షా కేంద్రంలో 8 మందికి టాప్ ర్యాంకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదని.. మాజీ మంత్రి హరీష్ అసలు విజ్ఞతే లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. విద్యుత్తు అక్రమాలపై విచారణ చేస్తున్న కమిషన్‌కు 12 పేజీల లేఖ రాసిన కేసీఆర్.. ముందు విచారణకు హాజరు కావాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ ఫైర్..
నీట్ పేపర్ లీక్ అంశంపై స్పందించారు ఎంపీ రాహుల్ గాంధీ. దేశంలో విద్యా వ్యవస్థను బీజేపీ కబ్జా చేసిందని అన్నారు. నీట్ పరీక్షతో లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని తాను ఆపినట్లు చెప్పుకునే మోదీ పేపర్ లీక్ లను అడ్డుకోవడంలో ఫెయిల్ అయ్యారని చురకలు అంటించారు. సుప్రీం కోర్టు విద్యార్థులకు న్యాయం చేస్తుందనే నమ్మకం లేదని.. తక్షణమే నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం పార్లమెంట్ లో పోరాడుతామని అన్నారు.