Congress: ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించిన కాంగ్రెస్ పార్టీ అదే ఉత్సాహంతో మరికొద్ది నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే శ్రేణులను సిద్ధం చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగం గానే సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేయడంతోపాటు మహారాష్ట్ర, జార్ఖం డ్, హరియాణా రాష్ట్రాలతోపాటు జమ్మూకశ్మీర్ అసెంబ్లీలకు త్వరలో జరగనున్న ఎన్నికలకుగాను వ్యూహాలు సిద్ధం చేసేందుకు వచ్చే వారంలో వరుసగా సమావేశాలు జరిపేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది.
ఈ నెల 24వ తేదీన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలు మొదటగా జార్ఖండ్ నేతలతో సమావేశమై వ్యూహం ఖరారు చేయనున్నారు. అదేవిధంగా, 25న మహారాష్ట్ర, 26న హరియాణా, 27న జమ్మూకశ్మీర్ నేతలతో భేటీ కానున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ మంగళవారం 'ఎక్స్'లో వెల్లడించారు. మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ అసెంబ్లీలకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అదేవిధంగా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించడం తెల్సిందే