/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Nandikati-Sreedhar-jpg.webp)
ఇటీవల తమ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి హన్మంతరావును (Mynampalli Hanmanthrao) ఓడించడమే లక్ష్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS Party) వ్యూహాలు రచిస్తోంది. మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలను తమ వైపు తిప్పుకోవడానికి పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన నందింకటి శ్రీధర్ తో (Nandikati Sreedhar) మంత్రి కేటీఆర్ స్వయంగా మాట్లాడారు. మంచి పదవి ఇస్తామని కేసీఆర్ (CM KCR) నుంచి కూడా నందికంటికి హామీ లభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు నందికంటి బీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ లేదా కేటీఆర్ సమక్షంలో శ్రీధర్ గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఆయన తన అనుచరులతో బీఆర్ఎస్ భవన్ కు వెళ్లడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి:Telangana Politics: ఆ ముగ్గురు మళ్లీ మిస్.. కాంగ్రెస్‌లోకి జంపేనా?
నందికంటి శ్రీధర్ గత ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అయితే పోత్తుల్లో భాగంగా ఆఖరి నిమిషంలో ఆయనకు టికెట్ దక్కలేదు. అయితే.. ఈ సారి తనకు తప్పనిసరిగా టికెట్ దక్కుతుందన్న భావనలో ఆయన ఉన్నారు. అయితే.. తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదన్న కారణంగా మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరారు. అప్పటి నుంచి నందికంటి శ్రీధర్ పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఈ మేరకు రాహుల్ గాంధీని కూడా కలిసి టికెట్ ఇవ్వాలని కోరారు. అయినా.. పార్టీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో పార్టీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు మల్కాజ్ గిరి జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి సైతం రాజీనామా చేశారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. అయితే బీసీ కోటాలో తగిన పదవి ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయనకు స్పష్టమైన హామీ లభించినట్లు తెలుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఎన్నికల తర్వాత ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.