రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే 55 మంది అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ (T-Congress First List) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అనేక మంది కాంగ్రెస్ సీనియర్లకు చోటు లభించలేదు. నాగర్ కర్నూల్ టికెట్ ను నాగం జనార్ధన్ రెడ్డికి (Nagam Jandradhan Reddy) ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. ఆ సీటును కూచుకుళ్ల రాజేశ్ రెడ్డికి ఇచ్చారు. సూర్యాపేటలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డికి మధ్య టికెట్ కోసం తీవ్ర పోటీ ఉంది. ఆ సీటును కూడా ఇప్పుడు ప్రకటించలేదు. దీంతో ఆ టికెట్ పటేల్ రమేశ్ రెడ్డికి ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇంకా ఖమ్మం జిల్లా సత్తుపల్లి టికెట్ కోసం మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే టికెట్ కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నేత మానవతారాయ్ కూడా పోటీలో ఉన్నారు. ఈ టికెట్ ను కూడా ప్రస్తుతానికి ప్రకటించలేదు.
ఇది కూడా చదవండి: T-Congress First List: కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లో 11 మంది బీసీలు.. లిస్ట్ ఇదే!
వరంగల్ తూర్పు టికెట్ కోసం కొండా సురేఖకు ఖాయమన్న ప్రచారం జరగగా.. ఆమె పేరు కూడా ఫస్ట్ లిస్ట్ లో లేకపోవడం వారి అనుచరులను షాక్ కు గురి చేసింది. ఇంకా కామారెడ్డి నుంచి తాను పోటీ చేస్తానని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అక్కడి నుంచి షబ్బీర్ అలీ పోటీ ఖాయమన్న ప్రచారం జరగగా.. ఆ టికెట్ ను కూడా ప్రకటించలేదు కాంగ్రెస్ హైకమాండ్. ఇంకా జహీరాబాద్ టికెట్ ను ఇటీవల బీజేపీ నుంచి చేరిన చంద్రశేఖర్ కు కేటాయించారు.
అయితే.. గతంలో అక్కడి నుంచి గెలిచి మంత్రిగా పని చేసిన గీతారెడ్డి.. ఇష్టపూర్వకంగానే పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఎల్బీనగర్ నుంచి మధుయాష్కీ పోటీ ఖాయమని ప్రచారం జరగగా.. ఆ టికెట్ ను కూడా ప్రకటించలేదు. ఆ టికెట్ ను ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్మోహన్ గౌడ్ కు ఇవ్వడం కోసమే ఆపినట్లు తెలుస్తోంది.