తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఎక్కువ స్థానాలను దక్కించుకోడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రత్యేక ఇన్‌ఛార్జిలను నియమించింది. ముఖ్యంగా ఒక్కో లోక్‌సభ స్థానానికి ఒక మంత్రికి బాధ్యతలు అప్పగించగా మరికొందరికీ రెండేసి నియోజకవర్గాల బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఈ మేరకు మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకుగానూ అబ్జర్వర్లను కూడా నియమించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెండు నియోజకవర్గాల బాధ్యతలు తీసుకుంటున్నారు. చేవెళ్ల, మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జిగా సీఎం రేవంత్ ఉండగా.. డిప్యూటీ సీఎం భట్టికి ఆదిలాబాద్ బాధ్యతలు అప్పగించారు. ఇక ఖమ్మం ఇన్‌ఛార్జిగా పొంగులేటి శ్రీనివాస్ ను ఎంపిక చేయగా నల్గొండ లొక్‌సభకు ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అలాగే భువనగిరి పార్లమెంట్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్ ఇంచార్జిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను నియమించారు.
ఇది కూడా చదవండి : నమ్మినవాడే నర హంతకుడు.. ఆస్తి కోసం ఫ్రెండ్ ఫ్యామిలీనే ఖతం చేశాడు
ఇదిలావుంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ కు తమకు అనుకూలంగా ఉన్న స్థానాల్లో పోటీ కూడా పెరిగింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆశావహులు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలువురు నేతలు ఎంపీగా తమ అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, హైదరాబాద్, చేవేళ్ల లోక్‌సభ స్థానాల్లో పోటీ తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, మిగిలిన స్థానాల్లో బరిగిలో దిగేందుకు నేతలు రెడీ అవుతున్నారు., కరీంనగర్ నుంచి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, ప్రవీణ్ రెడ్డి, పెద్దపల్లి నుంచి వివేక్ కుమారుడు, జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేశ్ షెట్కర్, మెదక్ నుంచి మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి హరివర్ధన్‌రెడ్డి, నిజామాబాద్ నుంచి జీవన్‌రెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ అధిష్టానం ఎవరెవరికీ అవకాశం ఇవ్వనుందనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఇక మెదక్ నుంచి కేసీఆర్ పోటీచేయబోతున్నట్లు తెలుస్తుండగా.. ఇక్కడినుంచే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీని పోటీలోకి దింపబోతున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ సోనియా మెదక్ పార్లమెంట్ నుంచి పోటీచేసి గెలిచారని, దీనిపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఫైనల్ నిర్ణయం తీసుకుందని సమాచారం. సోనియా మెదక్ నుంచి పోటిచేసేలా ఏకగ్రీవ తీర్మాణం చేసినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు.
పార్లమెంట్ నియోజకవర్గాల ఏఐసీసీ అబ్జర్వర్లు
వరంగల్ - రవీంద్ర దాల్వి
జహిరాబాద్ - మేయప్పన్
నాగర్‌కర్నూలు - పీవీ మోహన్
ఖమ్మం - ఆరీఫ్ నసీంఖాన్
నల్లగొండ - రాజశేఖర్ పాటిల్
పెద్దపల్లి - మోహన్ జోషి
మల్కాజ్‌గిరి - రిజ్వాన్ అర్షద్
మెదక్ - యూబీ వెంకటేశ్
సికింద్రాబాద్ - రూబీ మనోహరన్
హైదరాబాద్ - భాయ్ జగదప్
భువనగిరి - శ్రీనివాస్
మహబూబాబాద్ - శివశంకర్‌రెడ్డి
ఆదిలాబాద్ - ప్రకాశ్ రాథోడ్
నిజామాబాద్ - అంజలీ నింబాల్కర్
మహబూబ్‌నగర్ - మోహన్ కుమార్ మంగళం
చేవెళ్ల - ఎం.కె. విష్ణుప్రసాద్
కరీంనగర్ - క్రిష్టోఫర్ తిలక్