బిపర్ జాయ్ బీభత్సం.. కోస్ట్‌ గార్డ్‌ సాహసం

author-image
By Trinath
New Update
బిపర్ జాయ్ బీభత్సం.. కోస్ట్‌ గార్డ్‌ సాహసం

బిపర్‌ జాయ్‌ తుపాను గుజరాత్‌ లో బీభత్సం సృష్టిస్తోంది. అత్యంత తీవ్ర రూపం దాల్చిన ఈ సైక్లోన్‌ ప్రభావంతో.. అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్స్‌ సాహసపోతమైన ఆపరేషన్‌ చేపట్టారు. ఓ ఆయిల్‌ రిగ్‌ లో పనిచేస్తున్న 50 మందిని కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు. బలమైన గాలులు వీస్తున్నా రాత్రంతా శ్రమించి ఎంతో చాకచక్యంగా వారిని రక్షించారు.

Coast Guard rescues 50 from an oil rig

వీరంతా ద్వారకలోని ఓఖా తీరానికి 40 కిలోమీటర్ల దూరంలోని కీ సింగపూర్‌ ఆయిల్‌ రిగ్‌ లో పనిచేస్తున్నారు. అయితే.. తుపాను ప్రభావంతో వారికి ముప్పు పొంచి ఉండటంతో కోస్ట్‌ గార్డ్‌ రంగంలోకి దిగింది. సోమవారం సాయంత్రం నుంచి స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టి.. మొత్తం 50 మంది సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించింది. కోస్ట్‌ గార్డ్‌ కు చెందిన శూర్‌ వాహకనౌక, తేలికపాటి హెలికాప్టర్‌ ఎంకే-3 సాయంతో సోమవారం 26 మందిని, మంగళవారం మరో 24 మందిని రక్షించినట్లు భారత తీర భద్రతాదళం వెల్లడించింది.

శూర్‌ నౌకపై హెలికాప్టర్‌ ను ల్యాండ్‌ చేసి వీరిని క్షేమంగా తరలించారు. బిపర్‌ జాయ్ తుపాను కాస్త బలహీనపడినప్పటికీ.. తీరం దాటే సమయంలో పెను విధ్వంసం సృష్టించే అవకాశముందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈనెల 15న గుజరాత్‌ లోని జఖౌ తీరంలో తుపాను తీరం దాటనుందని.. ఆ సమయంలో ద్వారక, జామ్‌ నగర్‌, కచ్‌, మోర్బీ తదితర జిల్లాలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేశారు.

తుపాను తీరం దాటే సమయంలో గంటకు 150 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌ తీరంలో అధికారులు ముందస్తు సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో ఎంతో సాహసోపేతంగా కోస్ట్‌ గార్డ్‌ రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది. ఆయిల్‌ రిగ్‌ లో పనిచేస్తున్న 50 మంది సిబ్బందిని కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించింది.

Advertisment
తాజా కథనాలు