Cricket: అతనొక గొప్ప నాయకుడు.. నాకు గర్వంగా ఉంది: ద్రవిడ్

యువ భారత జట్టుపై కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు. 'ఈ టీమ్ ను చూస్తే గర్వంగా ఉంది. తొలి టెస్టులో ఓడిపోయినప్పటికీ తర్వాత మ్యాచుల్లో పుంజుకున్న తీరు అద్భుతం. రోహిత్‌ శర్మతో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంది. అతనొక గొప్ప నాయకుడు' అంటూ పొగిడేశాడు.

New Update
Cricket: అతనొక గొప్ప నాయకుడు.. నాకు గర్వంగా ఉంది: ద్రవిడ్

Ind vs eng: ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 4-1 తేడాతో దక్కించుకోవడంపై కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశారు. మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ద్రవిడ్.. ఈ భారత జట్టును చూస్తే తనకు చాలా గర్వంగా ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలి టెస్టులో ఓడిపోయినప్పటికీ తర్వాత మ్యాచుల్లో పుంజుకున్న తీరు అద్భుతమని కొనియాడారు.

అగార్కర్‌ కు ధన్యవాదాలు..
ఈ మేరకు ద్రవిడ్ మాట్లాడుతూ.. సిరీస్‌కు ముఖ్యమైన ఆటగాళ్లు దూరమైనా ప్రతిభ గల ప్లేయర్లు భారత్‌లో ఎంతోమంది ఉన్నారని చెప్పారు. యువకులు జట్టులో చేరి అవకాశాలు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. ‘నేను జట్టు సభ్యుల నుంచి ఎంతో నేర్చుకుంటున్నా. రోహిత్‌ శర్మ (Rohit Sharma)తో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంది. అతనొక గొప్ప నాయకుడు. యువ ఆటగాళ్లకు ప్రేరణగా నిలుస్తాడు. కోచ్‌గా ఉన్నా, కెప్టెన్‌గా ఉన్నా ఎక్కువమంది యువకులకు అవకాశం ఇవ్వలేం. ఈవిషయంలో సెలక్షన్‌ కమిటీ, అజిత్‌ అగార్కర్‌ (Agarkar)కు ధన్యవాదాలు. ఆటగాళ్లను ఎంచుకోవడం అంత సులభం కాదు. ప్రతిభ గల యువకులను కమిటీ ఎంపిక చేసింది. వచ్చిన అవకాశాన్ని వారు కూడా సరిగ్గా వినియోగించుకున్నారు. వ్యక్తిగత కారణాలతో మ్యాచ్‌ మధ్యలో ఇంటికి వెళ్లిన అశ్విన్‌ (Ashwin) రెండో రోజునే తిరిగొచ్చి మ్యాచ్‌లో పాల్గొనడం అభినందనీయం’ అని ద్రవిడ్ అన్నారు.

ఇది కూడా చదవండి: AP: సిద్ధం అన్నోళ్లకి ఈసారి మర్చిపోలేని యుద్ధమే.. నాగబాబు ట్వీట్ వైరల్!

మాలో కసిని పెంచాయి..
ఇక రోహిత్ మాట్లాడుతూ.. ‘సిరీస్‌ను సాధించడం మాములు విషయం కాదు. ఒక దశలో కొంతమంది మన జట్టుపై చేసిన వ్యాఖ్యలూ మాలో కసిని పెంచాయి. అనుభవం పెద్దగా లేని కుర్రాళ్లతో బరిలోకి దిగినా.. వారు చూపించిన తెగువ అద్భుతం. ఒత్తిడిలోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. జట్టు మొత్తం కలిసికట్టుగా ఇంగ్లాండ్‌ను ఓడించింది. అందరూ సెంచరీల గురించి మాట్లాడుతుంటారు. కానీ ప్రత్యర్థికి చెందిన 20 వికెట్లు తీయడమూ ముఖ్యమే. మా బౌలర్లు తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు. కుల్‌దీప్‌ యాదవ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ ప్రదర్శన సూపర్. గాయపడిన తర్వాత జట్టులోకి వచ్చి బౌలింగ్‌ చేస్తున్న తీరు అభినందనీయం. యువ బ్యాటర్ జైస్వాల్ సత్తా అందరికీ తెలిసిందే. ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడికి గురి చేసే టాలెంట్‌ అతడి సొంతం. సవాళ్లను ఎదుర్కోవడం అతడికి చాలా ఇష్టం. తప్పకుండా ఇది జీవితంలో చిరస్మరణీయంగా నిలిచిపోయే సిరీస్‌ అవుతుంది’ అంటూ రోహిత్ జట్టు సభ్యులపై ప్రశంసలు కురిపించారు.

Advertisment
తాజా కథనాలు