Telangana: ఈ ఏడాది సెప్టెంబర్ 7నుంచి గణేష్ నవరాత్రులు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై తెలంగాణ సీఎం రేవంత్ ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను సంబంధించి ప్రభుత్వానికి, నిర్వాహకులకు మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని, నగరంలో ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాలని తెలిపారు.
ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు..
అలాగే గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దరఖాస్తులను పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు. చిత్తశుద్ధి, నిబద్దతో ఉత్సవాలు నిర్వహించేలా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. నిమజ్జనానికి సంబంధించి ఉత్సవ నిర్వాహకుల నుంచి సహకారం అవసరముంటుందని, ఏరియాల వారీగా నిమజ్జనానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ప్రతీ ఏరియాలో కోఆర్డినేషన్ కమిటీలను నియమించుకోవాలి. వీవీఐపీ సెక్యూరీపై ప్రత్యేక దృష్టి సారించాలి. సెప్టెంబర్ 17 తెలంగాణకు చాలా కీలకమైంది. సెప్టెంబర్ 17న జరిగే రాజకీయ, రాజకీయేతర కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. హైదరాబాద్ బ్రాండ్ ను మరింత పెంచేందుకు నిర్వాహకుల సహకారం తప్పనిసరి ఉంటుందని సీఎం తెలిపారు.