CM Revanth Reddy: తెలంగాణ వ్యాప్తంగా వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో తెరుచుకున్నాయి. విద్యార్థులు బడిబాట పట్టారు. కాగా విద్యార్థినిలు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఉపయోగించుకోవడం పై సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ (X)లో.. " సిద్ధిపేట జిల్లా, నంగునూరు మండలం, మగ్దుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది. ఊరికి కిలో మీటర్ దూరాన ఉన్న పాఠశాలకు రూపాయి ప్రయాణ ఖర్చు లేకుండా వెళ్లగలుగుతున్నారు. ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సులో “ఉచిత ప్రయాణ పథకం” వల్ల మేం ఉచితంగా బస్సెక్కి స్కూలుకు వెళ్లగలుగుతున్నాం అని తమ చేతిలో ఆధార్ కార్డులు చూపిస్తూ వాళ్లంతా సంతోషం వ్యక్తం చేస్తుంటే… ఒక జర్నలిస్టు మిత్రుడు ఇలా ఫోటో తీసి పంపాడు." అంటూ రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు 'ప్రజా ప్రభుత్వం అనే ఇది' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.