CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ నిన్న రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు ఢిల్లీకి పయనమయ్యారు. ఉదయం 11 గంటలకు సోనియా గాంధీ నివాసంలో కీలక సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే సమావేశంలో సోనియా, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపాదాస్ మున్షీ, కేసీ వేణుగోపాల్ పాల్గొననున్నారు. తెలంగాణలో పీసీసీ అధ్యక్ష పదవి, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
పదవుల రేసులో...
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ రాని వారు, వేరే వారికోసం తమ టికెట్ త్యాగం చేసిన వారు, ఎంపీ టికెట్ రాని వారు.. ఇప్పుడు అందరు నామినేటెడ్ పదవులపై ఆశ పెట్టుకున్నారు. ఆనాడు కాంగ్రెస్ హైకమాండ్ కూడా కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం ఉంటుందని నేతలకు హామీ ఇచ్చింది. కాగా ఇప్పుడు టికెట్ రాని నేతలతో సహా ఎన్నికల్లో ఓటమి చెందిన నేతలు కూడా నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవి కొరకు వేచి చూస్తున్నారు.
పీసీసీ అధ్యక్ష రేసులో బీసీ కోటా రేసులో మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ ఉన్నారు. ఎస్సీ కోటా రేసులో సంపత్ కుమార్, లక్ష్మణ్ కుమార్ ఉన్నారు. అలాగే ఎస్టీ కోటా రేసులో ఎంపీ బలరాం నాయక్ పేర్లు ఉన్నాయి. కాగా మరి వీరిలో అధిష్టానం ఎవరికి ఏ పదవి అందిస్తుందో వేచి చూడాలి. మంత్రి పదవి రేసులో తమ భార్య పద్మావతి కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వివేక్ కూడా మంత్రి పదవి కోసం వేచి చూస్తున్నారు. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో ఆరు మంత్రి పదవులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అందులో విద్యాశాఖకు ప్రొఫెసర్ కోదండరాం పేరు ఫైనల్ అయినట్లు సమాచారం. కాగా ఈ ఊహాగానాలకు కాంగ్రెస్ అధిష్టానం ఈరోజు చెక్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.