CM Revanth Reddy: హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని తమ ప్రభుత్వం ఆహ్వానిస్తుందని, ఇందులో ఎవరి పట్లా వివక్ష చూపబోదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. HICC లో ఖమ్మగ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణలో ఎవరి పట్ల వివక్ష ఉండదని, అది ప్రజా ప్రభుత్వ విధానం కూడా కాదని అన్నారు. అన్ని కులాల పట్ల అపారమైన గౌరవం ఉందని, కమ్మ ప్రతినిధుల నైపుణ్యాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరి కష్టానికి గుర్తింపు, అవకాశాలు ఉంటాయని తెలిపారు.
జాతీయ స్థాయిలో తెలుగు వారి నాయకత్వం లేని లోటు స్పష్టంగా కనబడుతోందని పేర్కొన్నారు. గతంలో పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ , జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు లాంటి నాయకుల ప్రభావం ఢిల్లీలో స్పష్టంగా కనిపించేదని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో తెలుగు వారు రాణించే విషయంలో కుల మతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కమ్మ సంఘం కోసం వివాదంలో ఉన్న 5 ఎకరాల భూ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.